కడుపులోనే కరిగిపోతోంది! | melt under mother womb | Sakshi
Sakshi News home page

కడుపులోనే కరిగిపోతోంది!

Published Tue, Aug 30 2016 12:53 AM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM

కడుపులోనే కరిగిపోతోంది! - Sakshi

కడుపులోనే కరిగిపోతోంది!

భ్రూణ హత్యలు
– రెండేళ్లలో 30 ఘటనలు వెలుగులోకి..
– యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు
– అనుమతి లేని స్కానింగ్‌ సెంటర్‌లు
– పట్టనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ
– నాలుగేళ్ల కాలంలో నాలుగే కేసులు
– తనిఖీలు నామమాత్రం
 
ఇంటికి వెలుగునిచ్చే బంగారుతల్లి భూమ్మీదకు రాకుండానే చీకట్లో కలిసిపోతోంది. అంతరిక్షంలోకి వెళ్లొస్తున్నా సమాజం ఇప్పటికీ ఆడ..పిల్లగానే పరిగణిస్తోంది. క్రీడా పతకాల్లో సాటి లేదని చాటుతున్నా.. చదువులో పోటీ పడుతున్నా.. రాణించని రంగం అంటూ లేదని నిరూపిస్తున్నా.. ఎదిగిన కొద్దీ ఆమె గుండెలపై కుంపటిగానే మిగిలిపోతోంది. పున్నామ నరకం తప్పిస్తాడనుకునే కుమారుడు.. నిర్దయగా వీధిన నిలబెడుతున్నా గారాల బిడ్డడే. అదే అమ్మానాన్నకు చిన్న కష్టమొచ్చినా కన్నీరు పెట్టుకునే కూతురు మాత్రం కడుపులోనే కరిగిపోతోంది.
 
కర్నూలు(హాస్పిటల్‌): ఆడపిల్ల కడుపున పడిందని తెలిస్తే చాలు.. నిర్దాక్షిణ్యంగా కడతేరుస్తున్నారు. కొందరు వైద్యులు.. ఆర్‌ఎంపీలు.. ఆశా వర్కర్లు.. ఏఎన్‌ఎంలు ఈ ఘాతుకాన్ని ప్రోత్సహిస్తున్నారు. రెండు రోజుల క్రితం మంత్రాలయం మండలంలోని మాధవరంలో ఓ గర్భస్థ ఆడ శిశువు చెత్తకుప్ప పాలైన ఘటన ఇందుకు తాజా ఉదాహరణ. జిల్లాలో 190 పైగా అధికారింగా అనుమతి పొందిన స్కానింగ్‌ సెంటర్లు ఉండగా.. అనుమతి లేకుండా రెట్టింపు సంఖ్యలో వైద్యులు, ఆర్‌ఎంపీలు ఇలాంటి సెంటర్లను నిర్వహిస్తున్నారు. పాతబడిన స్కానింగ్‌ యంత్రాలను వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించకుండా ఆర్‌ఎంపీలకు అమ్ముకుంటున్నారు. దీనికి తోడు కొత్త వాటికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే వైద్య ఆరోగ్యశాఖలో పెద్దతంతుగా భావించి.. అనుమతి లేకుండానే స్కానింగ్‌ చేసేస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖాధికారులకు తెలిసినా మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 400 దాకా స్కానింగ్‌ సెంటర్లు ఉన్నా అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు చేసినా స్కానింగ్‌ నిర్వాహకులకు అనుకూలంగా నివేదికలు రాస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కాలంలో జిల్లాలో 4 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. భ్రూణహత్యలు జరిగాయనే సమాచారం తెలియగానే అక్కడికి వెళ్లి విచారణ చేసి, నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. కానీ ఈ తంతు తూతూమంత్రంగా సాగుతోంది.
 
నామమాత్రంగా కమిటీల నిర్వహణ
2012 సంవత్సరానికి ముందు పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌ను అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా కమిటీ ఉండేది. అందులో అధిక భాగం వైద్యులే ఉండేవారు. ఆ తర్వాత అప్రాప్రియేట్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో ఈ కమిటీలు రూపుదిద్దుకున్నాయి. ఇందులో రెవెన్యూ, పోలీస్, న్యాయాధికారులు, వైద్యాధికారులతో పాటు ఎన్‌జీఓలు ఉంటారు. ఆరు నెలల క్రితం స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేయాలని నోడల్‌ అధికారులకు ఆదేశించారు. వీరు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
30 మంది శిశువులు చెత్తకుప్పల పాలు
జిల్లాలో రెండేళ్ల కాలంలో 30 మందికి పైగా గర్భస్త శిశువులు చెత్తకుప్పల పాలైనట్లు సమాచారం. 2015 అక్టోబర్‌ 12న మద్దికెరలో, జులై 18న కర్నూలులోని హంద్రీబ్రిడ్జి వద్ద, జూన్‌ 26న అశోక్‌నగర్‌లోని రైల్వేబ్రిడ్జి వద్ద, అదే నెల 19న కేసీ కెనాల్‌లో, 9న  జొహరాపురం రోడ్డులో, మే 30న ఆదోనిలోని ఆర్‌అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్ద, ఫిబ్రవరి 21న కర్నూలులోని మద్దూర్‌నగర్‌ వద్ద ఒకటి, నంద్యాలలో జనవరి 17న రెండు, అదేరోజు కలెక్టరేట్‌ సమీపంలో ఒకటి శిశువుల మతదేహాలు లభించాయి. 2016లో జనవరి 23న కోడుమూరులో ఒకటి, ఫిబ్రవరి 10న కర్నూలులోని కల్లూరు బ్రిడ్జి వద్ద నాలుగు మతదేహాలను గుర్తించారు. ఇంకా వెలుగులోకి రాని ఎన్నో గర్భశిశువులు కుక్కలు, పందుల పాలయ్యాయి.
 
గర్భవతికి స్కానింగ్‌ చేసే పరిస్థితులు
  • జన్యు జనితమైన జీవకణాల్లో కలిగే అసాధారణ మార్పు గుర్తింపు, చికిత్స
  •  అసాధారణ జన్యు పరిస్థితి గుర్తింపు, చికిత్స
  •  ఎర్రకణాల్లో అసాధారణ స్థితి గుర్తింపు, చికిత్స
  •  లింగ సంబంధిత వ్యాధుల గుర్తింపు, చికిత్స
 
స్కానింగ్‌కు చట్టం ఆమోదించే పరిస్థితులు
  • గర్భధారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేస్తారు.
  •  గర్భిణిల వయస్సు 35 సంవత్సరాలు మించరాదు. ఆమెకు రెండు, అంతకన్నా ఎక్కువసార్లు గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు.
  • గర్భిణిలు హానికారక మందులు, అణుధార్మికశక్తి, రసాయనాల భారిన పడినప్పుడు, దాని ప్రభావం కలిగినప్పుడు.
  •  గర్భిణి, ఆమె  భర్త, ఇతర కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మానసిక బుద్ధిమాంధ్యం, శారీరక వైకల్యాలు, జన్యుసంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు.
 
లింగ నిర్ధారణ చేస్తే జైలుకే..
భ్రూణహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగనిర్ధారణ చేసినా, గర్భస్రావాలు చేయించినా ఇరువర్గాలను శిక్షించే వీలుంది. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. స్కానింగ్, అబార్షన్‌ చేసిన సదరు వైద్యుల పేరును భారత వైద్యవిధాన మండలి నుంచి తాత్కాలికంగా, కొన్నిసార్లు శాశ్వతంగా తొలగిస్తారు.
 
భ్రూణ హత్యలు చేస్తే కఠిన చర్యలు
లింగ నిర్ధారణ కోసం స్కానింగ్‌ చేయడం, లింగనిర్ధారణలో కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే భ్రూణ హత్యలు చేయడం నేరం. పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్‌ ప్రకారం కూడా ఇది నేరం. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపై రెండు కేసులనూ నమోదు చేస్తాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారం కోరితే భ్రూణ హత్యలు చేసే ఆస్పత్రులపై దాడులు చేసేందుకు ఏ క్షణంలోనైనా సిద్ధం.
– ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement