
పెళ్లిచూపులు...అమ్మాయి ఇంట్లో అబ్బాయికి!
అసలు సమస్య ఇంతదాకా ఎందుకొచ్చిదంటే...కొత్తగా స్కానింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో, కడుపులో ఉన్న బిడ్డని స్కాన్ చేసి... ఆడపిల్ల అయితే పిండాన్ని చిదిమేసేవారు. లింగ నిర్థారణ చట్టం వచ్చేవరకూ ఇది ప్రబలంగా కొనసాగింది. దాంతో అమ్మాయిల కొరత విపరీతంగాఏర్పడింది. ఉన్న అమ్మాయిలేమో... సాఫ్ట్‌వేర్ వరుళ్లనే కావాలనుకుంటున్నారు.
‘‘మిస్టర్ కిరణ్, ఈరోజు ఆఫీసుకు వస్తారా...?’’
‘‘తప్పకుండా! ఈరోజే రమ్మంటారా? ఎన్ని గంటలకు?’’
ఒక వ్యక్తి ఆఫీసుకు వెళ్లడానికి ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాడా అని కాస్త ఆశ్చర్యం వేసింది కదా? అంత ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ పిలుపు వచ్చింది అతడు పనిచేసే ఆఫీసు నుంచి కాదు... మ్యాట్రిమొనీ ఆఫీసు నుంచి!
డామిట్... బిడ్డ కథ అడ్డం తిరిగింది. ‘పుత్రోత్సాహం తండ్రికి/పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా/పుత్రుని కనుగొని బొగడగ/పుత్రోత్సాహంబు నాడు పొందురు సుమతీ’ అని బద్దెన రాసిన వాస్తవానికి సమాజం సవరణలు తెచ్చేసింది. పుత్రుడు ప్రయోజకుడవుతున్నాడు. తండ్రి కంటే ఎక్కువ సాధిస్తున్నాడు. కానీ తల్లిదండ్రులకు పుత్రోత్సాహం ఉండటం లేదు. ఎందుకంటే... ఇప్పుడు మెచ్చాల్సింది జనులు కాదు, జనకులు (యువతుల తండ్రులు).
‘మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేష్‌ని చూసి నవ్వుకున్నాంగానీ... గమనిస్తే మన చుట్టూనే బోలెడంతమంది పెళ్లికాని ప్రసాద్‌లు కనిపిస్తారు. వాళ్ల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణమేంటో అమ్మాయిల తల్లిదండ్రుల ‘చిరు కోరికల’ జాబితా చూస్తే తెలుస్తుంది. ‘‘అబ్బాయి విషయంలో మాకు పెద్దగా కోరికలేం లేవండీ.. ఏదో ఒక ఉద్యోగం ఉంటే చాలు. కాకపోతే సాఫ్ట్‌వేర్ ఇంజినీరై ఉంటే బావుంటుంది. జీతం కూడా లక్షలు అక్కర్లేదండీ... ఓ అరవై డెబ్భై వేలైనా సరిపోతుంది. అబ్బాయి మహేష్‌బాబులా ఉండక్కర్లేదు గానీ చూడ్డానికి బాగుంటే చాలు. జమిందారై ఉండాల్సిన పనిలేదు. అలా అని మరీ ఉద్యోగం మీదే ఏం ఆధారపడతాం చెప్పండి! ఎంతో కొంత భూమి/స్థలం ఉంటే ఇద్దరూ భరోసాగా బతకొచ్చు. అబ్బాయి కట్న కానుకలు అడిగేవాడైతే కష్టమండీ. మాకలాంటివి అస్సలు ఇష్టం ఉండదు’’. ఇదీ వరస!
కన్యాశుల్కం పోయినా వరకట్నం సమస్య వదల్లేదని అమ్మాయిలంతా కంగారు పడతారు కానీ... ప్రస్తుతం కంగారుపడాల్సింది అబ్బాయిలే. ఎందుకంటే త్వరలోనే వరకట్నం అంతమై, మళ్లీ కన్యాశుల్క కాలం వచ్చేలా ఉంది. ‘‘దగ్గరపడటమేంటి, వచ్చేసింది. మా ఊళ్లో ఓ అమ్మాయికి ఐదు లక్షల ఎదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకున్నారండీ’’ అని కొందరు నొక్కి వక్కాణిస్తున్నారు కూడా. ఎక్కడ చూసినా మావాడికి అమ్మాయి ఉంటే చూడండని అడగడమే. మా అమ్మాయికి అబ్బాయిని చూడండనేవాళ్లు తగ్గిపోతున్నారు. అమ్మాయిల కోసం సంబంధాలు వచ్చిపడుతుంటే.. ఇక అడగడమెందుకులే అని! మ్యాట్రిమొనీలన్నీ పెళ్లికాని ప్రసాదుల పుణ్యమా అని దివ్యంగా నడిచిపోతున్నాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మాదిరి నిష్పత్తి 1:5కు తగ్గట్లేదు.
అసలు సమస్యఇంతదాకా ఎందుకొచ్చిదంటే... కొత్తగా స్కానింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో, కడుపులో ఉన్న బిడ్డని స్కాన్ చేసి... ఆడపిల్ల అయితే పిండాన్ని చిదిమేసేవారు. లింగ నిర్థారణ చట్టం వచ్చేవరకూ ఇది ప్రబలంగా కొనసాగింది. దాంతో అమ్మాయిల కొరత విపరీతంగా ఏర్పడింది. ఉన్న అమ్మాయిలేమో... సాఫ్ట్‌వేర్ వరుళ్లనే కావాలనుకుంటున్నారు. దీంతోపాటు భూముల ధరల పెరగడంతో భూములున్నవారికి డిమాండ్ పెరిగింది. చదువుకున్న అమ్మాయిలేమో నగరాల్లో ఉన్నవారి వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రేమ పెళ్లిళ్లు కూడా పెరిగాయి. వెరసి అబ్బాయిలకు పిల్ల దొరకడమే కష్టమైపోతోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ సంపాదిస్తున్నారు. అంటే సంపాదనకు మించిన అర్హతేదో కావాలి. ఆ అర్హత సంపాదించేసరికి నెత్తిమీద అరెకరం పోవడం ఖాయం. ఇది మరో డిస్‌క్వాలిఫికేషను!
- ప్రకాష్ చిమ్మల