క్షేత్ర పరిశీలనలో భాగంగా గర్భిణుల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు
సాక్షి,మహబూబ్‌నగర్: ‘ప్రతి గర్భిణికి ఐదోనెలలో చేసే స్కానింగ్ అతి ముఖ్యమైంది.అయితే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు దీనిని విస్మరిస్తున్నారు..శిశువు ఆరోగ్య పరిస్థితిపై విభిన్న నివేదికలు(రిపోర్టులు) ఇస్తూ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేస్తున్నారు.’
తప్పుడు నివేదికలపై అధికారుల దృష్టి
తప్పుడు నివేదికలు ఇవ్వడంతో పాటు లింగ నిర్దారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. గత 15రోజుల నుంచి జిల్లాలో ఉన్న పీహెచ్‌సీల వారీగా, జిల్లా కేంద్రంలో పలు స్కానింగ్ సెంటర్‌లలో పరీక్షలు చేసుకున్న పలువురు మహిళలను ఎంపిక చేసుకొని వారితో మాట్లాడానికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. బాధితులు ఏం స్కానింగ్ చేయాలని అడిగితే నిర్వాహకులు ఏం చేశారు?, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చారు, ప్రస్తుతం గర్భిణులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశాలపై ప్రత్యేక టీం అధికారులు క్షేత్రస్థాయి పర్యటణ చేసి గర్భిణులు, వారి కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. గత 15రోజుల నుంచి జిల్లా కేంద్రంలో 15మంది గర్భిణుల నుంచి వివరాలు సేకరించారు.
డీఎంహెచ్‌వో అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆర్‌ఎంలు అబార్షన్ చేసినట్లు, లింగ నిర్ధారణ పరీక్షలు, లీగల్ అబార్షన్లు చేసినట్లు, జన్యుపరమైన లోపాలు ఉన్న స్కానింగ్ నిర్వాహకులు బాధితులకు చెప్పకుండా దాచడం వంటి ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. స్కానింగ్ కేంద్రం నిర్వహణకు అవసరమైన కీలక డాక్యుమెంట్ ఫాం–ఎఫ్‌లో సరైన వివరాలు నమోదు చేయకపోవడం, రికార్డులలో ఎవరికి ఎలాంటి స్కానింగ్ చేశారు అనే వివరాలను పూర్తిగా తప్పుగా రాయడం బయటపడింది.
మొక్కుబడిగా పరీక్షలు..
జిల్లాలో చాలా స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గర్భిణులకు మొక్కుబడిగా పరీక్షలు చేస్తున్నారు. నివేదికలో స్పష్టత లేకపోవడం వల్ల తల్లీ బిడ్డ ప్రాణాలకు ఆపద కల్గుతుంది. జిల్లాలో గర్భిణులకు స్కానింగ్ చేసే కేంద్రాలు 67(రేడియాలజిస్టుతో కూడినవి) వరకు ఉన్నాయి. ప్రతి గర్భిణికి సంబంధించి ఐదో నెలలో రేడియాలజిస్టు క్షుణంగా స్కానింగ్ చేయాలి. శిశువు ఎదుగుదల, అవయవాల తీరు ఇలా ప్రతీది పరిశీలించాలి. వారిచ్చే నివేదికను గైనకాలజిస్టులు చూసి వైద్యం అందించాలి.
శిశువు ఎదుగుదలలో ఉన్న లోపం చికిత్స పరంగా మెరుగుకాదనుకొంటే అబార్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో బాలికల నిష్పత్తి రోజు రోజుకు తీవ్రంగా తగ్గిపోతున్న క్రమంలో రాష్ట్ర ప్రజా ఆరోగ్య– కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖలోని మాస్ మీడియా విభాగం అధికారులు జిల్లాలో ప్రత్యేకంగా క్షేత్రస్థాయి పర్యటనను చేస్తున్నారు.
ప్రధానంగా పట్టణంలో ఉన్న స్కానింగ్ కేంద్రాల ద్వారా అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వాటిపై విచారణ జరుగుతుంది. దీనికితోడు పట్టణంలో కొందరు దళారి వ్యవస్థ ద్వారా పక్క రాష్ట్రాల్లో జోరుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేపిస్తున్నారు.లింగ నిర్ధారణను ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ అలా చేస్తే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా పరీక్షల పేరిట పుట్టబోయేది ఆడ, మగ అని తెలుపుతూ అందినంత దోచుకునే తంతు జిల్లాలో కొనసాగుతుంది.
చట్టాలు, నిబంధనలను కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కలిసి ఆడ శిశువులకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత పదేళ్ల కిందట 40మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 178కి చేరింది. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో మహబూబ్‌నగర్‌లో 67, వనపర్తిలో 38, నాగర్‌కర్నూల్‌లో 40, గద్వాలలో 25స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయి.
బాలికల సంఖ్య తగ్గుముఖం
ఓ వైపు భ్రూణహత్యలు.. మరోవైపు శిశు విక్రయాలు ఇంకో వైపు మూఢనమ్మకాలు వెరసి ఆడపిల్ల బతుకు దిక్కుతోచని పరిస్థితి అవుతుంది. తాజా జనాభా లెక్కలను పరిశీలిస్తే జిల్లాలోని గ్రామీణా ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిణామంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉంది. 2001లో వెయ్యి మందికి 952మంది ఆడపిల్లలున్నారు. 2011లో ఆ సంఖ్య 900కి తగ్గింది. ప్రస్తుతం ప్రతి వెయ్యి మందికి 850మంది ఆడపిల్లలు ఉన్నారు.
జిల్లాలోని పది మండలాల్లో మహిళల జనాభా గణనీయంగా పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పది మండలాల్లో ఆడపిల్లల నిష్పత్తి 800లోపు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి జిల్లాలోని తలకొండపల్లి, తిమ్మాజిపేట, ఆమనగల్లు, ఖిల్లఘనపురం, దేవరకద్ర, బాలానగర్, కొత్తూర్, దామరగిద్ద, వెల్దండ, అలంపూర్ మండలాల్లో మరింత ప్రమాదరకంగా స్త్రీ పురుష నిష్ఫతి 1000:800లోపు ఉంది. గత పదేళ్లలో జిల్లాలో గ్రామాల్లో ఆడపిల్లల సంఖ్య38శాతం తగ్గింది. జిల్లాలో 800వరకు ఆడపిల్లలు ఉన్న మండలాలు 10ఉన్నాయి.
నిబంధనలకు నీళ్లు
లింగ నిర్ధారణను ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ అలా చేస్తే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా పరీక్షల పేరిట పుట్టబోయేది ఆడ, మగ అని తెలుపుతూ అందినంత దోచుకునే తంతు జిల్లాలో కొనసాగుతుంది. చట్టాలు, నిబంధనలను కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కలిసి ఆడ శిశువులకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత పదేళ్ల కిందట 40మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 178కి చేరింది. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో మహబూబ్‌నగర్‌లో 67, వనపర్తిలో 38, నాగర్‌కర్నూల్‌లో 40, గద్వాలలో 25స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయి.
ఫాం ఎఫ్‌లో అన్ని వివరాలు నమోదు చేయాలి
జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలు ఫాం–ఎఫ్‌లో స్కానింగ్ చేసిన వివరాలు అన్నింటిని నమోదు చేయాలి. ఫాం–ఎఫ్ అనేది కీలక డాక్యుమెంట్‌గా భావించాలి. దాంట్లో అన్ని రకాల వివరాలు ఉండాలి. కొన్ని రకాల వివరాలు దాచిపెట్టడం మానుకోవాలి. లేకపోతే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. పీసీపీఎన్‌డీటీ యాక్టులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన జరుగుతుంది. ఇప్పటి వరకు 15మంది గర్భిణుల ద్వారా వివరాలు సేకరించి వాటిని ఇటీవలే హైదరాబాద్‌లో ఉన్నత అధికారులకు ఇవ్వడం జరిగింది. వేణుగోపాల్‌రెడ్డి, మాస్ మీడియా అధికారి
Comments
Please login to add a commentAdd a comment