
యాహూ సీక్రెట్ స్కానింగ్ సంచలనం?
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఇంక్ మరోసారి చిక్కుల్లో పడింది. అమెరికా ప్రభుత్వ నిఘా అధికారులతో కలిసి కస్టమర్ ఇ-మెయిల్స్ ను స్కాన్ చేసిన యాహూ గూఢచర్యం చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీని కోసం ఏకంగా ఒక సాఫ్ట్ వేర్ ను తయారు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు, వినియోగాదారుల ఈ-మెయిల్ ఖాతాలకు వచ్చే సమాచారాన్ని తస్కరించేందుకు యాహూ గత సంవత్సరం ఓ సాఫ్ట్ వేర్ ను తయారుచేసిందని, దీని సాయంతో రహస్యంగా అన్ని యాహూ మెయిల్ ఖాతాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది.
అమెరికా ప్రభుత్వం డిమాండ్ కు కట్టుబడి వందల మిలియన్ల యాహూ మెయిల్స్ స్కానింగ్ చేసినట్టు సమాచారం. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ఆదేశం మేరకు ఖాతాలను హ్యాక్ చేస్తోందని ముగ్గురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. సందేశాలను శోధించడం కోసం నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ, ఎఫ్బీఐ అధికారుల కోసం యాహూ ఈ పని చేస్తోందని సంస్థను వీడిన ఈ ముగ్గురు ఉద్యోగులు వెల్లడించారు. అధికారులు చెప్పిన కొన్ని పదాలు, సంకేతాల కోసం యాహూ యూజర్లకు వస్తున్న మెయిల్స్ మాత్రమే ఈ సాఫ్ట్ వేర్ సాయంతో స్కాన్ అవుతున్నాయని, అప్పటికే స్టోర్ అయివున్న మెసేజ్ లను స్కానింగ్ చేయడం లేదని వివరించారు. అలాగే కొన్ని ఎంపిక చేసిన ఖాతాలపై పూర్తి నిఘా ఉంచేందుకూ యాహూ అంగీకరించలేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ అధికారి వెల్లడించారు.
వీరు అందించిన సమాచారం ప్రకారం, యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరిస్సా మేయర్ ఈ నిర్ణయాన్ని కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకించారనీ, ప్రస్తుతం ఫేస్ బుక్ టాప్ భద్రతా ఉద్యోగిగా వున్న , యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అలెక్స్ స్టామోస్ జూన్ 2015 సం.రంలో సంస్థ నుంచి నిష్క్రమణకు దారితీసింది. అయితే, యాహూ దీనిపై స్పందించడానికి నిరాకరించిందింది. అలాగే సంస్థ మాజీ అధికారి స్టామోస్ కూడా ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు.
మరోవైపు ఎన్ఎస్ఏ , ఎఫ్ బీఐ ఇదే డిమాండ్ పై గతంలో ఇంటర్నెట్ కంపెనీలు ఆశ్రయించిందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే సాధారణంగా ఎన్ఎస్ఏ , ఎఫ్ బీఐ ద్వారా దేశీయ నిఘా కోసం కొన్ని అభ్యర్ధనలు చేస్తుందని, ఏ ఏజెన్సీ సమాచారాన్ని కోరి ఉంటుందనేది తెలుసుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఉపకరించేలా యాహూ రహస్యంగా సదరు సమాచారం సేకరించిందా? గూగుల్, రెడిఫ్ లాంటి ఇతర ఈ-మెయిల్ సేవల సంస్థలనూ ఇలాగే నిఘా వర్గాలు కోరాయా? అన్నది తెలియాల్సివుందని అభిప్రాయపడుతున్నారు.