స్కానింగ్ గది వద్దే ప్రసవించిన గర్భిణి
గుంటూరు జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం ఫలితం
గుంటూరు: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా వేగంగా చికిత్స అందించడంలో వారు చూపిన నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ స్కానింగ్ గది వద్దే కటిక నేలపై ప్రసవించింది. ప్రసవ వేదనతో ఆమె పెట్టిన కేకలు వైద్యుల చెవికెక్కలేదు. పైగా, ప్రసవం అనంతరం నేలపై ఉన్న రక్తాన్ని ఆ మహిళ తల్లి చేతే కడిగించారు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో జరిగింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దోమవరపు లావణ్య కాన్పు కోసం సోమవారం ప్రసూతి విభాగంలో చేరింది.
పురుటి నొప్పులు రావటంతో స్కానింగ్ చేయించుకు రమ్మని గైనిక్ వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటి అండ్ ట్రామా సెంటర్‌లోని అల్ట్రా సౌండ్ స్కానింగ్ గది వద్దకు రాత్రి 8.50 గంటలకు తీసుకెళ్లారు. గంటకు పైగా ఉన్నా ఎవరూ రాలేదు. ఈలోగా లావణ్యకు నొప్పులు ఎక్కువయ్యాయి. తట్టుకోలేక రాత్రి 9.50 గంటల సమయంలో ఆమె స్కానింగ్ గది ముందే కూలబడిపోయింది. ఆమె ప్రసవ వేదనను చూసిన కొందరు మహిళలు చీరలు అడ్డుగా పెట్టారు. మరికొందరు ఆమెకు సపర్యలు చేశారు. లావణ్య కటిక నేలపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది.