
ఆహారాన్ని పరీక్షించేందుకు స్కానర్!
వాషింగ్టన్: ఆహారాన్ని పరీక్షించి అందులో ఉన్న అలర్జీ కారక పదార్థాలు, పురుగుమందుల అవశేషాలు, క్యాలరీలు, అదనంగా ఉన్న కొవ్వు వంటి వాటిని గుర్తించే వినూత్న స్కానర్‌ను టొరాంటో పరిశోధకులు తయారు చేశారు. ‘టెల్‌స్పెక్’ అనే ఈ పరికరంపై ఉండే ఓ బటన్‌ను నొక్కి పళ్లెంలోని ఆహారంపై అలా తిప్పితే చాలు.. స్కానింగ్ అయిపోతుంది. ఈ పరికరం నుంచి ఆహారంపై తక్కువ శక్తితో గల లేజర్ వెలువడుతుంది. లేజర్ ఆహారంపై పడగానే.. ప్రతిబింబించే కాంతి తరంగాలను ఇది రామన్ స్పెక్ట్రోమీటర్ సాయంతో పసిగడుతుంది. ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉండే డాటాబేస్‌కు పంపిస్తుంది.
దాంతో అక్కడ విశ్లేషణ పూర్తయి, వెంటనే సంబంధిత వివరాలు ఓ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు అందుతాయి. దీనితో ఆహార పదార్థాలను 97.7 శాతం కచ్చితత్వంతో స్కాన్ చేయొచ్చట. ఇప్పటిదాకా 3 వేల ఆహార పదార్థాలను స్కాన్‌చేసేలా డాటాబేస్ రూపొందించామని, ఇది దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలనూ స్కాన్ చేయగలదని దీన్ని తయారుచేసిన పరిశోధకులు ఇసాబెల్ హాఫ్‌మన్, స్టీఫెన్ వాట్సన్‌లు చెబుతున్నారు. షాపులలో ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, హోటళ్లలో కూడా ఉపయోగపడే ఈ స్కానర్‌ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నారు. ధర రూ.19,752 మాత్రమే!