తిప్పి.. తిప్పి చంపేస్తారు
నిమ్స్ ట్రామా సెంటర్‌లో అవస్థలు
అందుబాటులో లేని స్కానింగ్ పరికరాలు
టెస్టుల పేరుతో క్షతగాత్రులను తిప్పుతున్న వైద్యులు
గగ్గోలు పెడుతున్న రోగులు
సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌కు వస్తున్న క్షతగాత్రులకు ప్రాణాలతో ఉండగానే నరకం కనిపిస్తోంది. గాయపడిన వారితో పాటు వారి వెంట ఉండే బంధువులకు సైతం ఈ పాట్లు తప్ప డం లేదు. ప్రమాదంలో గాయపడి ఇక్కడి అత్యవసర విభాగానికి చేరుకోగానే శరీరంలో ఏయే భాగాల్లో గాయాలయ్యాయో తెలుసుకునేందుకు వైద్యులు సీటీస్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ తీస్తారు. పొత్తికడుపులో తగిలి న దెబ్బలను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ టెస్టుకు సిఫా ర్సు చేస్తారు. కానీ ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో సకాలంలో ఈ సేవలు అందక క్షతగాత్రులు మృత్యవాత పడుతున్నారు. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ ట్రామా సెంటర్‌లో సీటీస్కాన్, ఎంఆర్‌ఐ, ఆల్ట్రా సౌండ్ యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. అత్యవసర సెంటర్‌లో ఉండాల్సిన పరికరాలు పాత భవనంలో ఉన్నాయి. దీంతో వచ్చిన క్షతగాత్రులను ఇటూ అటూ తిప్పుతున్నారు. ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 70-80 కేసులు వస్తుంటాయి. వీరిలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారే ఎక్కువ. గాయాల తీవ్రతను గుర్తించాకే వైద్యం చేస్తారు. అందుకోసం బాధితులకు సీటీస్కాన్, ఎంఆర్‌ఐ విధిగా చేస్తారు.
బతికుండగానే నరకం..
నిమ్స్ ట్రామా సెంటర్‌లో ఉండాల్సిన సీటీ, ఎంఆర్‌ఐ, ఆల్ట్రా సౌండ్ మిషన్లు పాత భవనంలోని రేడియాలజీ విభాగంలో ఉన్నాయి. తీసుకొచ్చిన క్షతగాత్రులను టెస్టుల కోసం ట్రామా సెంటర్ నుంచి పాత భవనానికి పంపుతున్నారు. అసలే విరిగి వేలాడుతున్న ఎముకలు, ఆపై భరించలేనినొప్పితో బాధపడుతున్నవారు అత్యవసర విభాగం నుంచి పాత భవనంలోని రేడియాలజీ విభాగానికి పదేపదే తరలించాల్సి రావడంతో గగ్గోలు పెడుతున్నారు. వారితో పాటు వెంట వచ్చిన బంధువులు సైతం తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా హెడ్, స్పైన్ ఇంజ్యురీతో బాధపడుతున్న బాధితులు చిత్రవధ అనుభవిస్తున్నారు.
పుష్కలంగా నిధులున్నా..
స్వయం ప్రతిపత్తి కలిగిన నిమ్స్‌కు నిధులకు కొదవ లేదు. ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో భారీగానే కేటాయిస్తోంది. దీనికి తోడు రోగుల నుంచి కోట్ల రూపాయాల ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులు ఖర్చు చేసి ట్రామా సెంటర్‌లోని బాధితుల కోసం సీటీ, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్ మిషన్లు కొనుగోలు చేయవచ్చు. ఎంఆర్‌ఐ మిషన్‌కు రూ.13 కోట్ల వరకు ఖర్చు అవుతుండగా సింగరేణి యాజమాన్యం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. టెండర్ కాల్‌ఫర్ చేసే సమయంలో డెరైక్టర్ ఇందుకు నిరాకరించడంతో దాతలనుంచి వచ్చిన విరాళాలు కూడా వెనక్కు వెళ్లిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే రూ.27 కోట్ల విలువైన యంత్రాలకు టెండర్ పిలిచామని, మరో రూ.36 కోట్లతో మరిన్ని వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు నిమ్స్ యాజమాన్యం చెబుతుండడం కొసమెరుపు.