స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచండి
పెద్దపల్లి: గర్భిణులకు ఆరోగ్య పరీక్షల పేరిట చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. బ్రూణ హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో స్కానింగ్ సెంటర్‌ల పూర్తి వివరాలను సేకరించి భద్రంగా ఉంచాలని సూచించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహణపై అనుమానం కలిగితే పోలీసుల సహకారంతో ఆ సెంటర్లను తనిఖీ చేయాల్సిందిగా డీఎంఅండ్‌హెచ్‌ఓ భిక్షపతిని కోరారు. జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్‌లో ఎంతమంది గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, వారికి సంబంధించిన వివరాలను సేకరించాలన్నారు. ప్రసవం తర్వాత కూడా విధిగా మహిళల వివరాలు నమోదు చేయాలన్నారు.
స్కానింగ్ సెంటర్ యజమాని విధిగా ట్రాకింగ్ చిప్ టెక్నాలజీ విధానాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక జేసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశానికి జిల్లాలోని వైద్యాధికారులు అబ్ధుల్‌బాబా, వై. సూర్యశ్రీరావు, బి. మల్లేశం, న్యాయసలహాదారు శంతన్ కుమార్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కవిత, స్థానిక ఎంపీపీ సందనవేని సునిత, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.