
వేలి ముద్రల స్కాన్‌తో జీవితాలనే రక్షించవచ్చు
ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3,53,000 శిశువులు జన్మిస్తున్నారు. వీరు ఎక్కువగా వర్ధమాన దేశాల్లోనే పుడుతున్నారు.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3,53,000 శిశువులు జన్మిస్తున్నారు. వీరు ఎక్కువగా వర్ధమాన దేశాల్లోనే పుడుతున్నారు. ఈ దేశాల్లో సరైన వైద్య సౌకర్యాలు అందక, పౌష్టికాహార లోపం వల్ల ఏడాదికి ఐదేళ్ల లోపు పిల్లలు 50 లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో కూడా ఎక్కువ మంది అందుబాటులోవున్న వ్యాక్సిన్ల తీసుకోక పోవడం వల్లనే మృత్యువాత పడుతున్నారు.
పిల్లల్లో ఇలాంటి మరణాలను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలతోపాటు పలు స్వచ్ఛంధ సంస్థలు కృషి చేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. పిల్లలకు సంబంధించిన మెడికల్ డాటాను అందుబాటులో లేకపోవడం, ఎవరు వ్యాక్సిన్లు తీసుకున్నారో, ఎవరు తీసుకోలేదో, వారెక్కడున్నారో తెలియకపోవడమే అందుకు కారణం. పిల్లల వేలి ముద్రలను స్కాన్ చేయడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి ఇట్టే బయట పడవచ్చని మిచిగాన్ యూనివర్శిటీలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అనిల్ జైన్ తెలిపారు.
ఏడాది నిండిన పిల్లల వేలి ముద్రలను స్కాన్ చేసినట్లయితే వాటి ద్వారా వారిని జీవితాంతం నూటికి నూరు శాతం కచ్చితంగా గుర్తుపట్టవచ్చని ఆయన చెప్పారు. ఏడాది లోపు, ఆరు నెలలపైబడిన పిల్లల వేలి ముద్రలను స్కాన్‌చేస్తే అవి నూటికి 99 శాతం ట్యాలీ అవుతాయని చెప్పారు. పిల్లల వేలి ముద్రలను చిన్పప్పుడే స్కాన్ చేయడం వల్ల వైద్య ప్రయోజనమే కాకుండా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలు మానవ అక్రమ రవాణాకు గురైనా, తప్పిపోయినా, కిడ్నాపైనా వేలి ముద్రల స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో అమలు చేస్తున్న ఆధార్ కార్డుల్లాగా కూడా ఓ జాతీయ గుర్తింపుగా పిల్లల వేలి ముద్రల స్కాన్ డాటా ఉపయోగపడుతుంది.
‘శరణు ఆశ్రమం ఆస్పత్రి’లో ఎన్జీవో సంస్థ ఆశ ఇటీవల 309 మంది పిల్లల వేలి ముద్రలను స్కాన్ చేసి భద్రపర్చిందని ఎన్జీవో సీఈవో సందీప్ అహూజా తెలిపారు. పిల్లల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, వారి వద్దకు ఆరోగ్య కార్యకర్తలను పంపించేందుకు ఈ డాటా తమకు ఎంతో ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. టీకాలు వేయించక పోవడం వల్ల, పౌష్టికాహార లోపం వల్ల మృత్యువాత పడే పిల్లలను ఈ డేటాను ట్రాక్ చేయడం వల్ల రక్షించవచ్చని ఆయన తెలిపారు. ‘బిల్ అండ్ మిలిండ గేట్ ఫౌండేషన్’ సహకారంతో తాము ఈ వేలి ముద్రల డేటాను సేకరిస్తున్నామని ఆయన చెప్పారు.