రోగ నిర్ధారణ చేయాల్సిన కొన్ని స్కానింగ్ సెంటర్లు గాడి తప్పాయి. కాసుల కోసం నిండు జీవితాల్లో నిప్పులు పోస్తున్నాయి. పుట్టబోయేది ఏ బిడ్డో చెప్పడం ద్వారా తల్లికి గర్భశోకం మిగిల్చి, కుటుంబాన్ని ఛిద్రం చేస్తున్నాయి. దీంతో ఆ బిడ్డలు గర్భంలోనే కరిగిపోతున్నారు. ఇంకొందరు లోకం వెలుగు చూడకుండానే మట్టిలో కలిసిపోతున్నారు.
తిరుపతి కార్పొరేషన్: ‘ఆడపిల్ల పుట్టిందని తిరుపతికి చెందిన ఓ మహిళను అత్తారింటి వారు బయటకు గెంటేశారు. రెండో సారి ఆడపిల్ల అని తెలిసిన ఎంఆర్‌పల్లెకు చెందిన పుష్పలతకు అత్తా, భర్త కలసి బలవంతంగా అబార్షన్ చేయించారు’ ఇవి మచ్చుకు మాత్రమే. ఇలాంటి సంఘటనలు చెప్పాలంటే చాంతాడంత పొడుగు ఉంటుంది. చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్లే ఇందుకు ప్రధాన కారణం. లింగనిర్ధారణ చట్టవిరుద్ధమని దీనిని ప్రభుత్వం నిషేధించింది.
అయితేనేం కళ్ల ముందు కాసులు చూపిస్తే నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ, పచ్చని కాపురాల్లో కలహాలు పెడుతున్నాయి జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు. గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య స్థితి గతుల వివరాలను తెలుసుకునేందుకే స్కానింగ్ సెంటర్లు పనిచేయాలి. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతో పుట్టేది ఆడపిల్లేనని ముందుగానే తెలిసిపోతోంది. దీంతో తొలి కాన్పు అనికూడా చూడకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్యాధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో స్కానింగ్ సెంటర్లకు కాసుల పంట కురిపిస్తోంది.
చట్టం వీరికి వర్తించదా?
భ్రూణ హత్యలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 1994లో ఒక చట్టాన్ని రూపొందించింది. దీన్ని గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ చట్టంగా తీసుకొచ్చింది. ఆపై 2003లో సమగ్ర సవరణలతో గ ర్భదారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేధం) చట్టంగా ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో ఇష్టారాజ్యంగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటవుతుండడం, ఒక్క తిరుపతిలోనే దాదాపు 250కి పైగా ఉన్నట్టు అధికారులే చెబుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్కానింగ్ సెంటర్ల వద్దకు వచ్చే వారు తమ అవసరం, పరిస్థితులను బట్టి అధికంగా డబ్బులు ఆశచూపెడుతున్నారు. దీంతో నిబంధనలను పక్కనబెట్టి లింగనిర్ధారణ పరీక్షలను చేస్తూ అధికంగా సంపాదించుకుంటున్నారు.
పేరుకే కమిటీలు !
జిల్లా స్థాయి మల్టీ మెంబరు అప్రాపరేట్ అథారిటీలో కలెక్టర్,జిల్లా న్యాయమూర్తి, ఎస్‌పీ, డీఎంహెచ్‌వో, ఎన్‌జీవో సభ్యుడు ఐదుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా అడ్వైజరీ కమిటీ 15 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. ఈరెండు కమిటీలు ప్రతి రెండు నెలలకు ఒక సారి సమావేశం కావాలి. అలాంటి సమావేశాలు నిర్వహించినట్టు దాఖలాలు లేవు.
జిల్లా డెమో విభాగాధికారులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో ప్రతినెలా సదస్సు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆఊసే లేదు. తాజా నిబంధనల ప్రకారం ప్రతి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వైద్యులై ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుండా కేంద్రాలను నిర్వహిస్తే వాటిని సీజ్ చేసి, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. అయితే అవేమి లేకుండా కేవలం నోటీసులు జారీ చేసి మమ అనిపించేస్తున్నారు.
చర్యలు తీసుకుంటున్నాము
లింగనిర్ధారణ చట్టపరమైన నేరం. స్కానింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో వీణాకు స్కానింగ్ చేసి, లింగనిర్ధారణ పరీక్షలు చేసినందుకు నోటీసులు ఇచ్చాం. నగరంలో అనుమతిలేని కేంద్రాలను గుర్తించాం. ఆలాంటి కేంద్రాలను సీజ్ చేస్తాం.
-డాక్టర్ దశరథరామయ్య,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి
‘స్కానింగ్’ నిప్పు
Published Sun, Nov 9 2014 2:30 AM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM
Advertisement
Advertisement