గర్భిణికి స్కానింగ్ చేస్తున్న వైద్యుడు
మెంటాడకు చెందిన ఓ దంపతులకు మొదటి కాన్పులో పాప పుట్టింది. రెండో కాన్పులో కూడా ఆడబిడ్డ పుడుతుందని తెలుసుకుని అబార్షన్ చేయించారు. గంట్యాడకు చెందిన ఓ కుటుంబం కూడా రెండో కాన్పులో ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని అబార్షన్ చేయించుకున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. ఆడపిల్ల అని తెలుసుకుని చాలామంది గర్భస్థ హత్యలకు సిద్ధపడుతున్నారు.
విజయనగరం ఫోర్ట్: గతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి మనంటికి వచ్చిందనుకునే వారు. కాని నేటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆడపిల్ల అంటేనే భారం అనుకుంటున్నారు. కొంతమంది వైద్యుల కాసుల కక్కుర్తి కారణంగా ఆడ శిశువులు తల్లి గర్భంలోనే హతమవుతున్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఆడ, మగ అనే వివక్ష ఇంకా పోలేదు.
72 మంది..
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో 72 మంది శిశువులు గర్భంలోనే మృతువాత పడ్డారు. ఇందులో ఎక్కువగా అబార్షన్లే ఉన్నాయని సమాచారం. మగపిల్లలైతే ప్రసవానికి సిద్ధపడడం.. ఆడపిల్ల అయితే బ్రూణహత్యలకు సిద్ధపడడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకుంటే భవిష్యత్ ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల ఉదాశీనతే కారణం
స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ లేకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించి భ్రూణహత్యలు జరగకుండా చూడాల్సిన వైద్య ఆరోగ్యశాఖాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కొంతమంది స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి లింగనిర్ధారణ చేపడుతున్నారు. ఈ విషయంలో అధికారులకు కూడా మామూళ్లు అందుతున్నాయని సమాచారం. లింగనిర్ధారణ చేయడానికి రూ. 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
వివరాలు తెప్పిస్తున్నాం..
స్టిల్ బరŠత్స్ (గర్భంలో చనిపోయిన శిశువులు) నివేదిక తెప్పించుకుంటున్నాం. ఏ తేదిన గర్భం దాల్చింది.. ఏ కారణం చేత అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.. తదితర వివరాలు తెలుసుకుంటున్నాం. ఎవరైనా కావాలని అబార్షన్ చేయించుకున్నా.. లింగ నిర్ధారణ చేసినా కఠిన చర్యలు తప్పవు. – డాక్టర్ సి. పద్మజ, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment