డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అమ్మాయిలు పెళ్లయ్యాక ఉద్యోగాలు మానేస్తుండడంతో ఆసుపత్రులలో వైద్యుల కొరత ఏర్పడుతోందన్న కారణంగా, అసలు వాళ్లను ఈ కోర్సులోకే రానీయకుండా చేసేందుకు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ దశలోనే వారిని ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల మీద టోక్యో మెడికల్ యూనివర్సిటీపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంచి మార్కులతో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాలకు వెళితే.. వేతనాలు తక్కువగా, పనిగంటలు ఎక్కువగా ఉండడం, ఇంట్లో కూడా పిల్లల పోషణ, సంరక్షణ బాధ్యతల్లో వారికి భర్త సహకారం లేకపోవడంతో జపాన్‌లో చాలామంది అమ్మాయిలు ప్రతిభాసామర్థ్యాలు ఉండి కూడా, తమకెంతో ఇష్టమైన కెరీర్‌ను విధి లేక మధ్యలోనే వదులుకోవలసి వస్తోంది.
రోడ్డు మీద ఆడపిల్లలను, మహిళలను.. పిల్లి కూతలతో, వికృతచేష్టలతో వేధిస్తే అక్కడికక్కడ 750 యూరోల జరిమానా (సుమారు 69 వేల రూపాయలు) విధించే కఠినమైన చట్టాన్ని ఫ్రాన్సు పార్లమెంటు ఆమోదించింది. ప్యారిస్‌లోని ఒక కేఫ్ బయట ఇటీవల మేరీ లాగ్యుర్ అనే యువతి.. వీధి వేధింపులకు ఎదురు తిరిగి, దాడికి గురైన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేపడంతో.. ఇప్పటి వరకు శిక్షార్హం కాకుండా ఉన్న ఈ స్ట్రీట్ టీజింగ్‌ను నేరంగా పరిగణించి, శిక్ష విధించేందుకు వీలుగా ఫ్రెంచి ‘జెండర్ ఈక్వాలిటీ’ మినిస్టర్ మార్లిన్ షియప్ప పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, తక్షణం అమలయ్యేలా చట్టాన్ని తెచ్చారు.
సిక్కింలో 9 నుంచి 14 ఏళ్ల వయసున్న 32 వేల మంది బాలికలకు రానున్న రెండు వారాల్లో తొలి విడతగా, మళ్లీ వీరికే పూర్తిస్థాయి సంరక్షణ కోసం వచ్చే ఆర్నెల్లలో తుది విడతగా హెచ్.పి.వి. (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్‌ను ఇచ్చే కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో మొదలైంది. చర్మవ్యాధికి, జననావయవాల ఇన్‌ఫెక్షన్‌కు కారణం అయ్యే ఈ వైరస్‌కు ఇచ్చే వ్యాక్సిన్ ధర మార్కెట్‌లో డోసు 3 వేల రూపాయల వరకు ఉండగా, ‘యునిసెఫ్’ సంస్థ కేవలం 400 రూపాయలకే సిక్కిం ప్రభుత్వానికి అందిస్తోంది.
దక్షిణాఫ్రికాలో ఉంటున్న భారతీయ సంతతి రచయిత్రి షబ్నమ్ ఖాన్ ఫొటో ఆమెకు తెలియకుండానే కొన్నేళ్లుగా అనేక అంతర్జాతీయ అడ్వర్‌టైజ్‌మెంట్ పోస్టర్‌లలో, వెబ్ సైట్‌లలో.. (న్యూయార్క్‌లో కార్పెట్లు అమ్ముతున్నట్లుగా, కాంబోడియాలో ట్రెక్కింగ్‌ను నిర్వహిస్తున్నట్లుగా, ఫ్రాన్స్‌లో డేటింగ్ కోసం అబ్బాయిల వేటలో ఉన్న అమ్మాయిగా.. ఇలా అనేక విధాలుగా) ప్రత్యక్షం అవుతూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరమైన వార్తగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాలోని ముగ్గురు భారతీయ ముస్లిం మహిళ గురించి ‘ఆనియన్ టియర్స్’ అనే పేరుతో నవల రాసి ప్రసిద్ధురాలైన షబ్నమ్.. తన స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకుని.. వివిధ దేశాల వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్న ఆ ఫొటో.. యూనివర్సిటీలో చదువుతుండగా ఓ ఫ్రెండ్ తీసినదేనని గుర్తు చేసుకుంటూ.. ఫొటోలు దిగేటప్పుడు అమ్మాయిలు జాగ్రత్త వహించాలని, తెలిసినవాళ్లయితే పర్వాలేదు కానీ, తెలియని వ్యక్తులు ఫొటో తీస్తున్నప్పుడు కచ్చితంగా అభ్యంతరం చెప్పి తీరాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment