నిఘా నేత్రం నీడలో మెట్రో! | cc cameras and scanners provided on metro platform | Sakshi

నిఘా నేత్రం నీడలో మెట్రో!

Dec 14 2013 11:06 PM | Updated on Sep 15 2018 3:43 PM

మరికొన్ని రోజుల్లో పరుగులు తీయనున్న నగర మొట్టమొదటి మెట్రో రైలు ప్లాట్‌ఫాంలను భద్రత దృష్ట్యా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దనున్నారు.

సాక్షి, ముంబై: మరికొన్ని రోజుల్లో పరుగులు తీయనున్న నగర మొట్టమొదటి మెట్రో రైలు ప్లాట్‌ఫాంలను భద్రత దృష్ట్యా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దనున్నారు. మెట్రో స్టేషన్లలో పేలుడు పదార్థాల స్కానర్లు ఏర్పాటు చేయనున్నట్లు ముంబై మెట్రోవల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) పేర్కొంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ (బీఏసీ) కారిడార్ కోసం భద్రత విషయంలో ప్రపంచ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు వారు వివరించారు.

అంతేకాకుండా హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌ప్లోజివ్ డిటెక్టర్లు (హెచ్‌హెచ్‌ఈడీ) లను, స్నిఫర్ డాగ్స్, 700 సీసీ టీవీ కెమెరాలను మెట్రో స్టేషన్లలో ఏర్పాటుచేయనున్నారు. దీంతో ప్రయాణికుల 11.4 కి.మీ. ప్రయాణం ఎంతో సురక్షితంగా ఉంటుందని ఎంఎంఓపీల్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఈ మెట్రో ప్రాజెక్ట్ భద్రత విషయమై సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఆశించవద్దని గతంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వారు వివరించారు. అంతేకాకుండా రాష్ట్ర పోలీసులు, ఇతర ప్రైవేట్ భద్రతా సిబ్బంది ఈ కారిడార్‌లో కాపలాదారులుగా విధులు నిర్వహిస్తారు. ఇక్కడ అమర్చనున్న దాదాపు 100 సీసీ కెమెరాలు నిరంతరం నిఘా ఉంచుతూ దృశ్యాలను చిత్రీకరిస్తాయని వారు  తెలిపారు. అంతేకాకుండా అన్ని స్టేషన్లలో సెక్యూరిటీ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయనున్నట్లు వారు వివరించారు. పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది హెచ్‌హెచ్‌ఈడీలను కలిగి ఉంటారు. దీంతోపాటు కొంతమంది  భద్రతా సిబ్బంది సివిల్ డ్రెస్‌లో విధులు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపా లు జరగకుండా చూస్తారు. రైళ్ల లోపల ఏర్పాటు చేసే సీసీటీవీ కెమెరాలతోపాటు కారిడార్‌లో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలను కంట్రోల్ రూంలకు అనుసంధానం చేయనున్నట్లు ఎంఎంఓపీఎల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement