విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి
సాక్షి, ముంబై: నగరంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన మహనీయుల విగ్రహాల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ రమేశ్ కాంబ్లే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హోం శాఖకు లేఖ రాశారు. గతంలో ఘాట్కోపర్‌లోని రమాబాయి అంబేద్కర్ నగర్, నాందేడ్, ఔరంగాబాద్, నాసిక్ తదితర ప్రాంతాల్లో గుర్తుతెలియని దుండగులు మహానీయుల విగ్రహాలకు హాని తలపెట్టిన ఘటనలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద సంఖ్యలో జరిగింది.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేయాలంటే మహనీయుల విగ్రహాల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంబ్లే అభిప్రాయపడ్డారు. ఈ కెమెరాల నియంత్రణను స్థానిక పోలీసు స్టేషన్లకు అనుసంధానించాలని సూచించారు. గల్లీలో, వాడల్లో, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాల బాగోగులు చూసుకునే బాధ్యత స్థానిక సంస్థలపై ఉంటుంది. దీంతో ఆ సంస్థలను విశ్వాసంలోకి తీసుకుని కెమెరాలు ఏర్పాటు చేయాలని కాంబ్లే డిమాండ్ చేశారు.