కామారెడ్డి టౌన్: బీబీపెటకు చెందిన లలిత అనే గర్భిణీ కడుపులో పిండం బాగా లేదని వైద్యులు తెలపడంతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు వారానికి ఒకసారి చొప్పున మూన్నెళ్లపాటు తిరిగి రూ.వేలాదిగా ఖర్చు చేసుకున్నారు. లింగంపేటకు ఎల్లారెడ్డి మండలానికి చెందిన సరస్వతి అనే మహిళలకు సాధారణ కడుపు నొప్పి రావడంతో వైద్యుల స్కానింగ్ చేయించుకోవాలనడంతో ప్రైవేట్‌లో రూ.800 పెట్టి స్కానింగ్ చేయించుకుంది. దోమకొండకు చెందిన ఎల్లయ్య కడుపు నొప్పి ఉండటంతో కడుపులో స్టోన్స్ ఉన్నాయని భావించిన వైద్యుడు స్కానింగ్ చేయించుకోవాలని సూచిండంతో రూ.వెయ్యి చెల్లించి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో చేయించుకున్నాడు.
ఇలా జిల్లాలో చాలా మంది ప్రజలు ప్రైవేట్‌లను ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేయించుకుంటున్నారు. అయితే మార్పు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆస్పత్రులు, సీహెచ్‌సీలలో స్కానింగ్ సేవలు ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టింది. పక్క జిల్లా పాత జిల్లా నిజామాబాద్‌లోని ప్రభుత్వ సీహెచ్‌సీలకు ప్రభుత్వం స్కానింగ్ యంత్రాలను మంజూరు చేసి ఇటీవలే ఆస్పత్రులకు పంపించారు. అయితే నూతన జిల్లాకు మాత్రం ఇప్పటి వరకు ఊసే లేదు.
నిజామాబాద్ జిల్లాలో ఆరు సెంటర్లకు..
నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి, మోర్తాడ్, ధర్పల్లి, నవీపేట్, వర్ని, బాల్కొండ ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)కు ఇటీవల స్కానింగ్ యంత్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. 6 యంత్రాలు సైతం జిల్లాకు చేరుకున్నాయి. సీహెచ్‌సీలో ఏర్పాటు చేసి గర్భిణులకు ప్రజలకు సేవలిందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీహెచ్‌సీల పరిధిలోని గర్భిణులకు, రోగులకు, ప్రజలకు ఇక ఉచితంగా స్కానింగ్ సేవలు అందనున్నాయి.
మన జిల్లాపై వివక్ష ఏల?
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్స్‌వాడలలో ఏరియా ఆస్పత్రులు, ఎల్లారెడ్డి, మద్నూర్, దోమకొండ, పిట్లం, గాంధారిలలో సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో 19 పీహెచ్‌సీలు ఉన్నాయి. అయితే మొదట అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్కానింగ్ సేవలను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం రెడియాలజిస్టుల పోస్టులు, స్కానింగ్ చేసే వారు లేక ప్రస్తుతం సీహెచ్‌సీలలోనే స్కానింగ్ సేవలు ప్రారంభించాలని అన్ని జిల్లాలలోని సీహెచ్‌సీలకు స్కానింగ్ యంత్రాలను మంజూరు చేసింది.
అయితే మన జిల్లాలోని 5 సీహెచ్‌సీలకు ఇప్పటి వరకు యంత్రాలు రాలేవు. అధికారులు సైతం తమకేమి పట్టనట్లు సమాధానాలిస్తున్నారు. ఇక్కడ ఎందుకు రాలేవని ప్రశ్నించేవారు కరువయ్యారు. వైద్యశాఖ అధికారులు కనీసం చర్యలు కూడా తీసుకోవడంలేదు.
ప్రైవేట్ సెంటర్స్‌లో వేలాదిగా ఫీజులు
కామారెడ్డి జిల్లాలో 28 వరకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లు ఉన్నాయి. బాన్స్‌వాడ, కామారెడ్డి ఏరియా ఆస్పత్రుల్లో మాత్రం ఉచితంగా ప్రభుత్వం స్కానింగ్ సేవలు అందిస్తున్నారు. ఇక అన్ని సీహెచ్‌సీల పరిధిలో ప్రభుత్వ స్కానింగ్ సేవలు లేక ప్రజలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లనే ఆశ్రయిస్తున్నారు. చిన్నపాటి కడుపు నొప్పి వస్తే రూ.600 నుంచి రూ.వేయి వరకు వసూలు చేస్తున్నారు. గర్భిణులైతే ప్రతినెలా వేలాదిగా ప్రైవేట్ సెంటర్‌లకు అప్పజెప్పుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్కానింగ్ సేవలు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment