అమ్మో ఒకటో తారీఖు!
Published Tue, Nov 22 2016 2:36 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 24,600 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ప్రతినెల రూ.1.60 కోట్ల వేతనాలు అందుతాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే 3,370 మంది ఉద్యోగులు ఉంటున్నారు. నాలుగో తరగతి నుంచి జిల్లా స్థాయి అధికారులు.. సహాయ అధికారుల వరకు వేతనంతో నెలవారీ బడ్జెట్‌ను నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం రూ.1000, రూ.500 నోట్లు రద్దు కావడం, ఆర్‌బీఐ నిబంధనలు పెట్టడంతో అయోమయం నెలకొంది. బ్యాంకుల నుంచి కేవలం వారంలో రూ.24 వేలు మాత్రమే డ్రా చేసేందుకు అనుమతి ఉండడంతో ఉద్యోగులు కంగారు పడుతున్నారు.
మరోవైపు వేతనాల చెల్లింపు విధానం స్పష్టత లేకపోవడంతో ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంకుల ద్వారా చెల్లిస్తామని వస్తున్న ఆదేశాలు కచ్ఛితంగా అమలవుతాయన్నది సందిగ్ధం. మరోవైపు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. వారికి వస్తున్న అరకొర వేతనాలతో జీవనం గడుపుతున్నారు. డిసెంబర్‌లో నెల జీతం వస్తుందా? రాదా? అన్నదానిపై సందిగ్ధంలో పడ్డారు.
కొన్ని ప్రైవేట్ సంస్థలు రూ.500, రూ.1000 నోట్లు రద్దు కావడంతో డబ్బులు అందుబాటులో లేనవి సిబ్బందికి తెలియజేశారు. కొన్ని చోట్ల ప్రైవేట్ ఉద్యోగులకు పాతనోట్లను ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అవస్థలు పడే పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగా రూ.10 వేలు చెల్లింపు ఉన్నా దానిని ఏలా అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పెద్ద మొత్తంలో బడ్జెట్ వస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో రూ.10 వేలు అందవు. ఇలా ప్రతి ఉద్యోగి డిసెంబర్ వస్తుందంటే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టీఎన్‌జీవోఎస్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నగదు రూపంలో వేతనాలు అందించాలని విన్నవించారు.
అంతా అయోమయమే..
నవంబర్ నెల జీతం ఏలా వస్తుందోనని ఉద్యోగులు అయెమయం చెందుతున్నారు. చాలా మంది ఉద్యోగులు నెలసరి బడ్జెట్ ఆధారంగా వేతనాలు వినియోగించుకుంటున్నారు.ప్రస్తుతం పూర్తి స్థాయి వేతనం వస్తుందా ఏలా చెల్లిస్తారన్నదానిపై అయెమయం ఉంది. ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ప్రతి నెల మాదిరిగానే వేతనాలు అందించాలి.
- రేవంత్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
నగదు విత్‌డ్రా పరిమితి పెంచాలి..
నగదు విత్‌డ్రా పరిమితి పెంచాలి. అలాగైతే ఉద్యోగులకు ఇబ్బందులు ఉండవు. బ్యాంకుల ద్వారా అందించే విధానం ఉన్న పరిమితులు లే కుండా అందించాలి. బ్యాంకుల్లో ఇబ్బందులు ఉండకూడదు. అలాగైతే వేతనాలు సక్రమంగా అందుతాయి.ఉద్యోగులు అందోళన చెందరు. వేతనాల చెల్లింపు విధానంను ముందుగానే ప్రకటిస్తే బాగుంటుంది.
- అన్వర్‌పాషా, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ
Advertisement
Advertisement