మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీకాలం ఏడాది ఉంటుంది. ఏడాది పూర్తయిన తర్వాత ఆరు నెలల పాటు పొడగించవచ్చు. ఇలా ఆరు నెలల చొప్పున కేవలం రెండుసార్లు (ఏడాది) మాత్రమే పొడగించడానికి వీలుంటుంది. నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగియనుండడంతో మళ్లీ పదవుల పందేరానికి తెరలేవనుంది. రిజర్వేషన్లు సైతం మారాయి. ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం నానా పాట్లు పడుతున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో పదవు లు ఆశిస్తున్నవారు ఎమ్మెల్యేల ఆశీస్సులు పొందే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈసారి ఎలాగైన అవకాశం తమకు ఇవ్వా లని కోరుతున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు పలువురు గతంలో మార్కెట్ కమిటీ పదవులు ఆశించినా.. రిజర్వేషన్లు కలిసి రాక నిరాశ చెందారు. ఈసారి రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న నేతలు ఈ పదవులను కైవసం చేసుకోవడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం కావడంతో పదవుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు ఆచితూ చి వ్యవహరించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో రాజకీయంగా తమకు కలిసొచ్చే విధంగా ఈ పదవుల ఎంపిక ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో పలు మార్కెట్ కమిటీ పదవుల ఎంపిక విషయంలో మొదటిసారి కొన్ని విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి విమర్శలకు తావులేకుండా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మారిన రిజర్వేషన్లు..
ఆయా మార్కెట్ కమిటీల పాలకవర్గం రెండేళ్లకు మించి పనిచేయడానికి వీలు లేదు. ఇప్పటికే పలు పాలకవర్గాల పదవీ కాలం రెండేళ్లు పూర్తయ్యింది. దీంతో కొత్త పాలకవర్గాల ఎంపిక కోసం రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్లు మారుతుండడతో కొత్త వారిని నియమించడం అనివార్యం అవుతుంది. మారిన రిజర్వేషన్ల మేరకు కొత్త పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో పదవుల పందేరం జిల్లాలో షురువైంది.
17 మార్కెట్ కమిటీలు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 17 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి.. వర్ని, కోటగిరి, కమ్మర్‌పల్లి, వేల్పూర్ మార్కెట్ కమిటీల పాలకవర్గం పదవీకాలం గతేడాదే ముగిసింది. రెండు పర్యాయాలు ఆరు నెలల చొప్పున పొడిగించారు. పొడగించిన పదవీ కాలం కూడా ఈనెల 22నే ముగిసింది. దీంతో ఈ మార్కెట్ కమిటీలకు కొత్త వారిని నియమించాల్సి ఉంది.
బోధన్, ఆర్మూర్ పాలకవర్గాలు నవంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోనే అత్యంగా పెద్ద మార్కెట్ కమిటీల్లో ఒకటైన నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం చాలా ఆలస్యంగా నియామకమైంది. ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. మారనున్న రిజర్వేషన్ల మేరకు ఈ పదవి జనరల్‌కు కేటాయించారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం పొడగించిన పదవీకాలం ఏప్రిల్ 22తో ముగిసింది. అలాగే కామారెడ్డి, భిక్కనూరు కమిటీల పదవీకాలం పక్షం రోజుల్లో జూన్ ఆరుతో ముగియనుంది. సదాశివనగర్, మద్నూర్, బిచ్కుంద కమిటీల పదవీకాలం జూలైలో, పిట్లం కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు వరకు, గాంధారి, ఎల్లారెడ్డి కమిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఉంది.
రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఈ పదవీకాలం ముగిసిన మరునాడే పాలకవర్గాలు రద్దు అవుతాయి. కొత్త రిజర్వేషన్ల మేరకు పాలకవర్గాన్ని నియమించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మార్కెటింగ్ శాఖ అధికారులను ఇన్‌చార్జిగా నియమిస్తారు. ఇలా ప్రస్తుతానికి బాన్సువాడ, వర్ని, బీర్కూర్, కోటగిరి, కమ్మర్‌పల్లి, వేల్పూర్ కమిటీలకు మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు పర్సన్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment