గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. తగిన సలహా ఇవ్వండి. – ఎల్. కృష్ణారెడ్డి, విశాఖపట్నం
లివర్... కొవ్వు పదార్థాలను గ్రహించి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. అది కొన్ని రకాల కొవ్వుపదార్థాలను స్వయంగా ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించేది. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా ఇది 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదమూ కలిగించకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి.
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ∙మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ∙ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు. ∙తరచూ చేపలు తినడం మేలు. అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది. ∙మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి.
ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్
ఒకే స్ట్రెచ్‌లో పనిచేస్తుంటే...
స్లీప్ కౌన్సెలింగ్
వాస్తవానికి మా వర్కింగ్ షిఫ్ట్ వ్యవధి ఎనిమిది గంటలు. అయితే మరో ఆరు గంటలు అదనంగా పనిచేస్తే మాకు ఇచ్చే వేతనం డబుల్ ఉంటుంది. అందుకే మేం సాధారణంగా డబుల్ డ్యూటీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటాం. నాకు తీవ్రమైన ఒళ్లునొప్పులు వస్తున్నాయి. తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరుడు, హైదరాబాద్
అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారికి తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారిలో అలసటతోపాటు, ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు చేస్తుంది.
పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ∙చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా ఎక్కువ.
కంటి నిండా నిద్ర అవసరం. ∙కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. ∙రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ∙భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ∙ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్
రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఫ్యాటీ లివర్ ఉంటే...
Published Fri, Feb 3 2017 11:29 PM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM
Advertisement
Advertisement