సాక్షి, ముంబై : నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీ వర్షం కారణంగా మెట్రో బోగీలలోని ఏసీ గ్రిల్ నుంచి వర్షపు నీరు లోపలికి రావడంతో ప్రయాణికులు తడిసి ముద్దవుతున్నారు.. ఇదే సమస్య ఈ నెల ఐదో తేదీన కూడా ఎదురైంది. బోగీల లోపల వర్షపు నిలిచిపోయింది. మరోపక్క కొన్ని మెట్రో స్టేషన్‌లో బ్యాగులు స్కానింగ్ చేసే యంత్రాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు సరిగా పనిచేయడం లేదు. ముఖ్యంగా ప్రయాణికుల బ్యాగులు కచ్చితంగా స్కానింగ్ చేయాలి. కానీ అప్పుడప్పుడూ సాంకేతిక లోపంతో ఈ యంత్రాలు పనిచేయడం లేదు. మెట్రో భద్రత గాలిల్లో కలిసిపోయింది.
వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మధ్య తరచూ..
వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్‌ల మధ్య ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇదివరకే సీరియస్‌గా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే సమస్య పునరావృతమైంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. వారంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక స్టేషన్‌లో, ఏదో ఒక రైలు బోగీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రారంభించిన రోజే ఓ స్టేషన్‌లో రైలు ఆగిపోయింది. ఆ తరువాత వారం, పది రోజుల్లోనే ఓ పక్షి ఓవర్ హెడ్ వైరులో చిక్కుకోవడం, మరో వారంలో ఓ బోగీ డోరు తెర్చుకోలేదు.
ఈ ఘటన తరువాత రెండు రోజులకు ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా పైలట్ గమనించి కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. తరువాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సఘటనతో 20 నిమిషాలపాటు రైలు నిలిపివేయాల్సి వచ్చింది. గత వారంలో మరోల్ స్టేషన్‌లో రైలు ఆగింది. కానీ రెండు బోగీల డోర్లు తెర్చుకోలేదు. తాజాగా మంగళవారం మళ్లీ ఏసీ గ్రిల్ నుంచి వర్షాపు నీరు లోపలికి రావడం ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. రోజు దాదాపు 16 లక్షల మందిని చేరవేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఐదు లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రవేశపెట్టిన ఈ మెట్రో రైళ్లలో తరుచూ ఎదురవుతున్న సమస్యల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నగర ‘మెట్రో’ భద్రతకు నీళ్లు
Published Wed, Jul 16 2014 11:36 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement