జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ | Gender Determination Scanning Centers in Kurnool | Sakshi
Sakshi News home page

గర్భశోకం

Published Tue, Feb 4 2020 12:23 PM | Last Updated on Tue, Feb 4 2020 12:23 PM

Gender Determination Scanning Centers in Kurnool - Sakshi

జిల్లాలో భ్రూణహత్యలు కొనసాగుతున్నాయి. 20 వారాలు దాటిన తర్వాత గర్భస్రావం  చేయకూడదని నిబంధనలు ఉన్నా పలు ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు.  ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా పెద్దగా çస్పందించడం లేదు. కర్నూలులోని కొత్త బస్టాండ్, ఎన్‌ఆర్‌ పేట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉండే పలు ఆసుపత్రులలో యథేచ్ఛగా భ్రూణహత్యలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి నెలా 60కి పైగానే  చేస్తున్నారు.  ఆదోని, ఎమ్మిగనూరు,  కోడుమూరు, గూడూరు, డోన్, నంద్యాల,  నందికొట్కూరు  ప్రాంతాల్లోనూ  ఇదే  పరిస్థితి.

కర్నూలు(హాస్పిటల్‌):జిల్లాలో 260కి పైగా స్కానింగ్‌ కేంద్రాలకు అనుమతులు ఉన్నాయి. అయితే అనధికారికంగా మరో 400కు పైగానే నిర్వహిస్తున్నారు. పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ ప్రకారం లింగనిర్ధారణ         నేరం. దీనికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లోని స్కానింగ్‌ కేంద్రాల్లో పలువురు వైద్యులు యథేచ్ఛగా లింగనిర్ధారణ చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే చాలు అధిక శాతం అబార్షన్‌కు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాల సమ్మతి మేరకు జరుగుతున్న ఈ తంతులో అటు గర్భిణి కుటుంబసభ్యులు, ఇటు వైద్యవర్గాలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. లింగనిర్ధారణ, భ్రూణహత్యలో ఇద్దరికీ శిక్ష పడుతుందని భావించి గుట్టుగా ఉంచుతున్నారు.

930కి తగ్గిన బాలికల సంఖ్య
జిల్లాలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతోంది. 2011 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు గాను జిల్లాలో సగటున 930 మందిమాత్రమే మహిళలు ఉన్నారు. డోన్‌లో 889, ప్యాపిలి 894, గడివేముల 899, శ్రీశైలం 892, ఆదోని డివిజన్‌లో 900 మాత్రమే స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 920లోపు స్త్రీలు ఉన్నట్లు సమాచారం.  ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సైతం సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. జిల్లాలో బాలికల సంఖ్య ఎందుకు తగ్గుతుందో తెలుసుకునేందుకు త్వరలో ఓ బృందం జిల్లాకు రానున్నట్లు తెలిసింది.  

అధికారులంటే భయం లేదు
లింగనిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ పీఎన్‌డీటీ చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ఉన్నట్లు ఆయా స్కానింగ్‌ కేంద్రాల్లో పోస్టర్లు అతికించి, లోపల మాత్రం యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు కాలేదు.

స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం
జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాలను అధికారులు తరచూ తనిఖీ చేస్తున్నారు. పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ ప్రకారం స్కానింగ్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారా, లేదా అని పరిశీలిస్తున్నాం. నిబంధనల మేరకు లేని కేంద్రాలకు నోటీసులు ఇస్తున్నాం.  –డాక్టర్‌ కె.వెంకటరమణ, ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌వో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement