సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో పుడుతున్నారు. ఈ సమస్యను అధిగమించి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అవసరమైన వారికి ‘టిఫా’ స్కానింగ్ చేయించాలని నిర్ణయించింది. ఈ టెస్ట్ ద్వారా బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు, తద్వారా తగు వైద్యం అందించేందుకు వీలుంటుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇక టిఫా స్కానింగ్‌లు చేయనున్నారు. టిఫా అంటే.. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్.
టిఫా’ స్కానింగ్
దీని ద్వారా 18 నుంచి 22 వారాల మధ్య పిండాన్ని స్కాన్ చేస్తారు. శిశువు అవయవ క్రమం ఏర్పడే దశలోనే లోపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గుర్తించిన సమస్యలకు మందులు వాడొచ్చు. లేదా అవకాశముంటే అబార్షన్ చేయించుకునేందుకు వీలుంటుంది. ఒక్కో స్కానింగ్‌కు రూ.వెయ్యి ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా లేకుంటే.. ప్రైవేట్ డయాగ్నిస్టిక్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వమే ఉచితంగా చేయిస్తుంది.
7 శాతం మందిలో లోపాలు..
ప్రతి వంద మంది గర్భిణుల్లో 7 శాతం మందిలో లోపాలుండే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లందరికీ టిఫా స్కానింగ్ చేసి ఆ లోపాలను సరిదిద్దుతారు. ఎక్కువగా మేనరికం వివాహాల వల్ల, క్రోమోజోమ్స్ లోపం వల్ల, మానసిక లోపాలు(మెంటల్ డిజబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భిణి అవడం వల్ల, బ్యాడ్ అబ్‌స్ట్రెటిక్ హిస్టరీ(గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలు తలెత్తడం), కన్సాగ్యుయస్ మ్యారేజెస్(రక్త సంబంధీకులను పెళ్లి చేసుకోవడం), సెక్స్ లింక్డ్ డిజార్డర్స్(శృంగార సంబంధిత వ్యాధులు).. ఇలా రకరకాల కారణాలతో లోపాలు తలెత్తే అవకాశముంటుంది.
అలాగే రాష్ట్రంలో ఏటా 8.96 లక్షల ప్రసవాలు జరుగుతాయని కుటుంబ సంక్షేమ శాఖ చెబుతోంది. వీటిలో 7 శాతం మందికి.. అంటే 62 వేల మందికి పైగా గర్భిణులకు టిఫా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. తల్లి ఆరోగ్య పరిస్థితులు, రక్త సంబంధీకులను వివాహం చేసుకున్నారా? గర్భం దాల్చాక పరిస్థితులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే వైద్యాధికారి, లేదా గైనకాలజిస్ట్ టిఫా స్కానింగ్‌కు రిఫర్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment