గుంటూరుమెడికల్: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో గర్భిణులకు అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్‌లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను మంత్రి రజిని శుక్రవారం గుంటూరులోని వేదాంతం హాస్పిటల్‌లో లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు సీమంతం చేసి పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్ అవసరం ఉంటుందని, అందుకు దాదాపు రూ.7 కోట్ల ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రతి గర్భిణికి రెండుసార్లు చేయాల్సి ఉంటుందని, వీటిని కూడా పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేసేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2022–23లో రూ.3,400 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.32 లక్షల కాన్పులు ఉచితంగా చేశామని, కేవలం గర్భిణుల చికిత్సకు రూ.247 కోట్లు వెచ్చించామని వివరించారు.
ఆరోగ్య ఆసరా పథకం కింద రోగి కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 17,54,000 మందికి పైగా ఆర్థిక ఆసరా అమలు చేశామని, అందుకోసం రూ.1,075 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధిరప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వేదాంత హాస్పిటల్ ఎండీ డాక్టర్ చింతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment