ఆ పరీక్ష పాసవ్వాల్సిందే..
గర్భిణులకు స్కానింగ్‌పై వైద్యులకు ప్రభుత్వం నిబంధన
సాక్షి, హైదరాబాద్: ఇకపై గర్భిణులకు ఎవరు పడితే వాళ్లు స్కానింగ్ చేయకూడదని, దీనికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇష్టారాజ్యంగా స్కానింగ్ చేయడం, లింగ నిర్ధారణ జరిపి మగబిడ్డా, ఆడబిడ్డా అనేది ముందే చెప్పేస్తుండటంతో.. ఇకపై అల్ట్రాసోనాలజీ (స్కానింగ్) చేయాలంటే ఆయా డాక్టర్లు కచ్చితంగా తాము నిర్వహించే ప్రత్యేక పరీక్షలో పాసవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది.
ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయితే 6 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. వీటి ప్రకారం శిక్షణ పూర్తి చేసుకున్న వైద్యులే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.