గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం పొందేందుకు ప్రభుత్వం వారికి రూ.6,000 ధన సహాయం చేయనుంది.
న్యూఢిల్లీ: గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం పొందేందుకు ప్రభుత్వం వారికి రూ.6,000 ధన సహాయం చేయనుంది. డిసెంబరు 31న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ హామినివ్వడం తెలిసిందే. తాజాగా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇందుకోసం ‘మాతృత్వ ప్రయోజన పథకం’ను ప్రారంభించి, మార్గదర్శకాలు నిర్దేశించింది. రూ.6,000 వేలను మూడు దఫాలుగా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది.
స్త్రీలు గర్భవతిగా నమోదు చేసుకున్నప్పుడు తొలిసారి, కాన్పు సమయంలో రెండోసారి, బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత జననాన్ని నమోదు చేయించుకుని, బీసీజీ టీకా వేయించుకుని, ఓపీవీ, డీపీటీ–1–2లు తీసుకున్న అనంతరం మూడోసారి డబ్బును ఖాతాలో జమచేస్తారు. కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో ఈ వ్యయాన్ని భరిస్తాయి.