అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గూఢచర్యం
అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గూఢచర్యం
Published Fri, Jun 9 2017 11:24 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కాకినాడ సిటీ: జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించి పిండలింగ నిర్ధారణ వెల్లడిచేసిన సెంటర్లపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై కలెక్టరేట్ కోర్టుహాలులో శుక్రవారం రాత్రి జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఆరు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు, 19 సెంటర్లకు లైసెన్స్ రెన్యూవల్, 10 సెంటర్లకు అడ్రసు మార్పు అనుమతులు రాటిఫికేషన్‌లు జారీ చేశారు. జిల్లాలో రిజిస్టర్ అయిన 328 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య నిఘా ఉంచి డెకోయ్, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ చేసే ముందు గర్భిణి అనుమతి సంతకాన్ని తప్పనిసరిగా సేకరించాలన్నారు. ఈ అనుమతి పత్రాలు కేంద్రం రిజిష్ట్రేషన్ లైసెన్స్, స్కానర్ వివరాలు, పరీక్షలు నిర్వహించే వైద్యులు, నిపుణుల వివరాలు విధిగా ఆన్‌లైన్‌లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్‌డీఓలు, ప్రోగ్రామ్ అధికారులు తమ పరిధిలో అల్ట్రాసౌండ్ స్కానర్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. 6వ అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీనివాసాచారి, ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఎంహెచ్‌ఓ కె.చంద్రయ్య, ఆర్‌డీఓలు రఘుబాబు, విశ్వేశ్వరరావు, గణేష్‌కుమార్ పాల్గొన్నారు.
వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాళిక
జిల్లాలో ఆరు నెలల నుంచి 15 నెలలలోపు పిల్లలందరికీ మీజెల్స్, రూబెల్లా వైరస్‌ల నివారణ వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాలిక చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఐసీడీఎస్, విద్యా, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆగష్టు నెలలో పిల్లలందరికీ నూరుశాతం వ్యాక్సిన్ పంపిణీకి ప్రత్యేక ఎంఆర్ కాంపెయిన్ నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు.
సబ్‌కా సాత్–సబ్‌కా వికాస్‌కు సమగ్ర ఏర్పాట్లు:
ఈనెల13న కాకినాడలో నిర్వహించే సబ్‌కా సాత్–సబ్‌కా వికాస్‌కు సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి స్ధానిక రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమాలపై ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Advertisement
Advertisement