Ys Jagan: నిక్షిప్తం.. ఆరోగ్యం నిక్షేపం | Ap: Cm Ys Jagan Review Meeting On Covid 19 Control In Tadepalli | Sakshi
Sakshi News home page

Ys Jagan: నిక్షిప్తం.. ఆరోగ్యం నిక్షేపం

Published Wed, Aug 11 2021 12:33 PM | Last Updated on Thu, Aug 12 2021 7:47 AM

Ap: Cm Ys Jagan Review Meeting On Covid 19 Control In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు వేగంగా, సులభంగా మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ కార్డులను డిజిటలైజ్‌ చేసి ఆధార్‌తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లాగిన్‌ కాగానే సంబంధిత వ్యక్తితోపాటు కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు వెంటనే లభ్యమయ్యేలా చూడాలని సూచించారు.

ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఆధార్‌ నంబర్‌ను వెల్లడించగానే సంబంధిత వ్యక్తి/కుటుంబం ఆరోగ్య వివరాలు సమస్తం లభ్యమయ్యే విధానాన్ని తేవాలన్నారు. ఈ విధానాలన్నీ సమర్థంగా అమలు చేయడంలో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల అవి త్వరగా పూర్తయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ హెల్త్‌పై ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ ఆరోగ్య చరిత్ర
ఆరోగ్యశ్రీ కార్డులో సంబంధిత కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య వివరాల డేటాను మొత్తం నిక్షిప్తం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో ఈ వివరాలన్నీ తెలిసేలా ఉండాలన్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో కూడా డేటాను నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి విలేజ్, వార్డు క్లినిక్‌లో కంప్యూటర్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్న తేదీ, సమయం కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నిక్షిప్తం కావాలని, బ్లడ్‌ గ్రూప్‌ వివరాలు కూడా పొందుపరచాలని చెప్పారు.

గ్రామాలకు వెళ్లే డాక్టర్‌కు సులభంగా తెలియాలి
104 వాహనం గ్రామాలకు వెళ్లగానే ఒక వ్యక్తి ఆరోగ్య వివరాలు డాక్టర్‌కు సులభంగా తెలిసేలా ఈ విధానం ఉండాలని, దీనివల్ల చికిత్స చేయడం చాలా సులభతరమవుతుందని, వైద్యం కూడా త్వరగా అందుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. షుగర్, బీపీ, బ్లడ్‌గ్రూపు సహా ఇతర వివరాలను కార్డులో నిక్షిప్తం చేయాలన్నారు. విలేజ్‌ క్లినిక్‌లలో సాధారణ పరీక్షలు నిర్వహించేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఎం ప్యానెల్‌ అయిన ఆస్పత్రుల వివరాలను విలేజ్‌ క్లినిక్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి అందుబాటులో ఉంచాలన్నారు. చికిత్స కోసం రోగులను నేరుగా సంబంధిత ఆస్పత్రిలో చేర్పించడం, వారితో సమన్వయం చేసుకోవడం లాంటి బాధ్యతలను సిబ్బంది నెరవేర్చేలా ఈ విధానం ఉండాలని సూచించారు. 

చిన్నారుల వ్యాక్సిన్ల వివరాలు కూడా..
చిన్నారులు అన్నిరకాల వ్యాక్సిన్లు తీసుకుంటున్నారా? లేదా? అనే వివరాలు కూడా ఆరోగ్యశ్రీ కార్డుల్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల వ్యాక్సిన్లపై ఫాలో అప్‌ చేయడానికి అవకాశాలు ఉంటాయని, తల్లులు, పిల్లల ఆరోగ్యంపై విలేజ్‌క్లినిక్స్‌ అత్యంత శ్రద్ధ వహిస్తాయని చెప్పారు.

గ్రామాల్లో కాలుష్యంపై దృష్టి పెట్టాలి..
గ్రామాల్లో కాలుష్య నివారణపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నీరు, గాలి నమూనాలను పరిశీలించి కాలుష్య స్థాయిలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్యం వివరాలు నమోదు చేయడం వల్ల అధికారులు వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పల్లెల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తరచూ శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా ఈ అంశాలపై దృష్టి సారించడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, దీనికి సంబంధించి ప్రోటోకాల్స్‌ పటిష్టంగా రూపొందించాలని స్పష్టం చేశారు. 

 డిప్యుటేషన్లు వద్దు.. పోస్టుల భర్తీనే
విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ ఎంత మంది సిబ్బంది ఉన్నారు? ఇంకా ఎంతమంది కావాలి? అనే అంశాలపై డేటా రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన సంఖ్యలో వైద్యులను నియమించాలని, జిల్లాను యూనిట్‌గా తీసుకుని నియామకాలు చేపట్టాలని సూచించారు. తాత్కాలికంగా సర్దుబాటు చేసే డిప్యూటేషన్లు వద్దని, అన్ని పోస్టులు భర్తీ చేయాలని, మూడు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ‘‘సిబ్బంది కొరత అనేది లేదన్న మాట మూడు నెలల్లో నాకు చెప్పగలగాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ స్ధాయి ప్రమాణాలతో ఉత్తమ ఆరోగ్య సేవలు అందాలని సూచించారు. అటెండెన్స్‌ను బయోమెట్రిక్‌  కెమెరాలతో అనుసంధానం చేయాలన్నారు. ఒక డాక్టర్‌ కనుక 3 రోజులు వరుసగా రాకపోతే తగిన చర్యలు తీసుకునేలా ఉండాలన్నారు. వారిని పనిచేసే చోటకైనా బదిలీ చేయాలి లేదా పనిచేసేలా అయినా చూడాలని సూచించారు.

గిరిజన ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు!
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏజన్సీల్లో వైద్య సేవలపై పర్యవేక్షణ చేపట్టి అక్కడ విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించడంపై ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు. జీఎంపీ ప్రమాణాలున్న ఔషధాలను రోగులకు అందించాలన్నారు. పీహెచ్‌సీల నుంచి పైస్థాయి ఆస్పత్రుల వరకూ కాంపౌండ్‌ వాల్స్‌ ఉండేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

 

సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌సెంటర్‌ ఇన్‌చార్జి ఏ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement