State Investment Promotion Board Meeting Chaired By CM YS Jagan - Sakshi
Sakshi News home page

ఉక్కు సంకల్పంతో.. సీమకు స్టీల్‌ ప్లాంట్‌

Published Mon, Dec 12 2022 3:58 PM | Last Updated on Tue, Dec 13 2022 8:06 AM

State Investment Promotion Board Meeting Chaired By CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా రూ.23,985 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకా­శాలు లభించనున్నాయి. వైఎస్సార్‌ జిల్లాకు ఇచ్చిన హామీ మేరకు గట్టి ప్రయత్నంతో దేశంలో రెండో అతి పెద్ద స్టీల్‌ దిగ్గజ కంపెనీ జేఎస్‌­డబ్ల్యూని సీఎం జగన్‌ ఒప్పించి ఉక్కు కర్మాగారం నెలకొల్పేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పోర్టులు లాంటి కీలక సదుపాయాలు లేనందున స్టీల్‌ ప్లాంట్‌పై కొన్ని పెద్ద గ్రూప్‌లు తటపటా­యించినప్పటికీ దిగ్గజ సంస్థను ఒప్పించి మరీ కడపలో ఉక్కు కర్మాగారం కలను సాకారం చేస్తుం­డటం గమనార్హం. సోమవారం తాడేపల్లి­లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. వైఎస్సార్‌ జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పా­టుతో పాటు అదానీ గ్రీన్‌ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ నెలకొల్పే పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలి­పింది. వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని

మార్చే ప్రక్రియలో భాగంగా కడపలో ఉక్కు పరి­శ్రమ ఏర్పాటు గొప్ప ప్రయత్నమని ఈ సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా పలు అనుబంధ పరిశ్రమల రాకతో రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయ­న్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే స్టీల్‌ప్లాంట్‌ పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారు­లను ఆదేశించారు. 

ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ
దేశంలో రెండో అతిపెద్ద స్టీల్‌ గ్రూప్‌ జేఎస్‌డబ్ల్యూ వైఎస్సార్‌ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌­డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌ రెండు విడతల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా ఒక మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు కానుంది. రెండో విడతలో మరో రెండు మిలియన్‌ టన్నులతో కలిపి మొత్తం 3 మిలియన్‌ టన్నుల  సామర్థ్యంతో యూనిట్‌ అందుబాటులోకి రానుంది. స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్‌ లాంటి పలు రంగాల్లో విస్తరించిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ విలువ సుమారు రూ.1,76,000 కోట్లు (22 బిలియన్‌ డాలర్లు) ఉంటుంది. ఏటా 27 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి ద్వారా దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా జేఎస్‌డబ్ల్యూ నిలిచింది.  కంపెనీకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో స్టీల్‌ ప్లాంట్లున్నాయి. తాజాగా మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీలో అడుగు పెడుతోంది.

ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ
ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్‌ఎనర్జీ పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. సుమారు రూ.6,330 కోట్ల పెట్టుబడితో 1,600 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వెయ్యి మెగావాట్లు, అనకాపల్లి – విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల సామర్థ్యంతో వీటిని నెలకొల్పనుంది. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉపాధి కల్పించే ఈ యూనిట్‌ పనులను 2024 డిసెంబర్‌లో ప్రారంభించిం నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 4,196 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది. 

ఎర్రవరం, సోమశిల వద్ద రూ.8,855 కోట్లతో హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు
ఎర్రవరం, సోమశిల వద్ద షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ రూ.8,855 కోట్లతో హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్లు, సోమశిల వద్ద 900 మెగావాట్లతో మొత్తం రెండు ప్రాజెక్టుల ద్వారా  2,100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది జూలైలో ప్రారంభమై విడతల వారీగా డిసెంబర్‌ 2028 నాటికి పూర్తిస్థాయిలో యూనిట్‌ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యా­ల­నాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, రెవెన్యూశాఖ (వాణిజ్య పన్నులు) స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ(ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె.ప్రవీణ్‌ కుమార్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూ­షణ్‌ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్య­నారాయణ, రవాణాశాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యు­మ్న, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి.సృజన, ఏపీపీసీబీ మెంబర్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ ఎండీ షన్‌మోహన్‌ పాల్గొన్నారు.  


చదవండి: బీఆర్‌ఎస్‌కు మద్దతుపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement