పునరావాస చర్యలు వేగవంతంగా చేపట్టాలి
పునరావాస చర్యలు వేగవంతంగా చేపట్టాలి
Published Fri, Jun 16 2017 11:23 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
రంపచోడవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న గిరిజనులకు భూమికి భూమి, పునరావాసం, రీసెటిల్‌మెంటు పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్ధానిక పీఎంఆర్‌సీ భవనంలో రెవెన్యూ, ఇరిగేషన్, గిరిజన సంక్షేమం ఇంజినీరింగ్, గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపునకు సంబంధించిన భూసేకరణపై ఇప్పటివరకూ ఎంతభూమి సేకరించారు, ఇంకా సేకరించాల్సిన భూముల వివరాలపై సమీక్షించారు. త్వరితగతిన భూములు సేకరించి కాలనీల నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. ముంపునకు సంబంధించి తొలిదశలో ఆవాసాలకు పునరావాసం, రీసెటిల్‌మెంటు చేపట్టాలన్నారు. నిర్వాసితుల సంస్కృతి, భాష, జీవన విధానం, ప్రస్తుత, భవిష్యత్తు తరాల జీవనోపాధి భద్రతకు శ్రద్ధ కనబరచేలా చర్యలు చేపట్టాలన్నారు. ముంపునకు గురవుతున్న భూములపై ఇంకా మిగిలిఉన్న భూములకు త్వరగా అవార్డులు పై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ నెలాఖరుకు ప్రక్రియను పూర్తిచేసి సంబంధిత భూములను ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలన్నారు. నిర్వాసితుల అభీష్టానికి అనుగుణంగా వారి కాలనీలకు సమీపంలో భూములను సేకరించి, సంబంధిత తహసీల్దార్‌లు సబ్ డివిజన్ చేసి పంపిణీ చేయాలన్నారు. దేవీపట్నం మండలంలో కొండమొదలు గ్రామంలో భూసేకరణ చట్టప్రకారం జరగలేదని, కొంతమంది గిరిజనులు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చారని ఎస్‌డీసీ మురళీమోహనరావు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా స్టే వివరాలు ఏదశలో ఉందని ఆరా తీసి నివేదిక సమర్పించాలన్నారు. గుర్తించిన 60 లొకేషన్లలో పునరావాస కాలనీలో ఇళ్లు, దేవాలయాలు, కమ్యూనిటీ హాలు, రహదారులు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నది నిర్వాసితులకు మ్యాప్‌ల ద్వారా వివరించాలన్నారు. 15మంది డిప్యూటీ తహసీల్దార్‌లను ఆర్‌అండ్ ఆర్ పనుల నిర్వహణ కోసం డిప్యూట్ చేస్తామన్నారు. చింతూరుకు నలుగురు సర్వేయర్లను తాత్కాలికంగా నియమిస్తామన్నారు. ఎస్‌డీసీల వారీగా మిగిలిన భూసేకరణకు సంబంధించి నిధుల మంజూరు కొరకు అంచనాలు రూపొందించి, ఎన్ని గ్రామాలకు, ఎంతమేర ప్యాకేజీ అవసరం అనే అంశాలపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవోలు దినేష్‌కుమార్, జి. చినబాబు, ట్రైనీ కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్‌డీసీలు జీవీ సత్యవాణి, మురళీ మోహనరావు, ఎల్లారమ్మ, తహసీల్దార్లు, డీటీలు, ఈఈలు తదితరుల పాల్గొన్నారు.
Advertisement
Advertisement