వేళ్లు కట్ అయినా... అతికించవచ్చు! | However, paste, cut fingers ...! | Sakshi
Sakshi News home page

వేళ్లు కట్ అయినా... అతికించవచ్చు!

Published Mon, Feb 22 2016 11:03 PM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM

However, paste, cut fingers ...!

హోమియో కౌన్సెలింగ్
 

 నా వయసు 21. నాకు కొంతకాలంగా నెలసరి సరిగా రాకపోతుండడంతో డాక్టర్‌ని సంప్రదించాను. స్కానింగ్ తీయించి పీసీఓడీ అని చెప్పారు. మందులు వాడుతున్నంతకాలం నెలసరి సరిగానే వస్తోంది. మానేస్తే మళ్లీ మామూలే. వివాహానంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే అది సంతానలేమికి కారణమవుతుందేమోనని మా అమ్మానాన్నా ఆందోళన చెందుతున్నారు. ఈసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా దీనికి సరైన పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు.
 - ఒక సోదరి, ఆదిలాబాద్

 మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఎక్కువ మంది స్త్రీలను వేధిస్తుంటుంది. వివాహితులలో సంతానలేమికీ కారణమవుతుంది.
 
మెచ్యూర్ ఫాలికిల్ (అపరిపక్వమైన అండం) గర్భాశయానికి ఇరువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. సాధారణ రుతుచక్రం ఉన్న మహిళలలో నెలసరి అయిన 11-14 రోజుల మధ్యన రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి ఒక అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ పీసీఓడీ ఉన్న వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా, అపరిపక్వత కలిగిన అండాలు నీటిబుడగలుగా మారి అండాశయపు గోడలపై ఉండిపోతాయి.
 కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, పిండి, కొవ్వు పదార్థాలు, జంక్‌ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, జన్యుపరమైన అంశాలు.
 
లక్షణాలు: నెలసరి రాకపోవడం, ఒకవేళ వచ్చినా అండాశ యం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో నాలుగైదు రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు కొనసాగడం, నెలసరి ఆగి ఆగి రావడం, రెండు రుతుచక్రాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, ముఖంపై, వీపుపై మొటిమలు రావడం, మెడచుట్టూ, మోచేతి మడతలలో, మోచేయి భాగాలలో చర్మం మందంగా, నల్లగా మారడం, ముఖం, ఛాతీపై మగవారి మాదిరిగా రోమాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
జాగ్రత్తలు: జీవన విధానంలో మార్పులు చేసుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,  సమతులాహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు.
 హోమియోకేర్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందించే కాన్‌స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా రోగి మానసిక, శరీర తత్వాన్ని బట్టి హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేసి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీ సమస్యను నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు.
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
 
ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్
నా వయసు 36 ఏళ్లు. ఒక పరిశ్రమలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. ఏడాది క్రితం మెషిన్‌లో కుడి చేయి ఇరుక్కోవడంతో నాలుగు వేళ్లు సగానికి పైగా నలిగిపోయాయి. ఇవి మళ్లీ అతికించడానికి పనికిరావనీ, పైగా తీవ్ర రక్తస్రావం కూడా జరగడంతో ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. దాంతో నేను ఉద్యోగం కోల్పోయాను. పనిచేసే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నప్పటికీ చేతివేళ్లు లేకపోవడంతో టెక్నికల్ పని చేయలేకపోతున్నా. నాపై ఆధారపడ్డ కుటుంబసభ్యులను పోషించలేక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మానసిక వేదనతో కుమిలిపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చూపండి.
 - యాదగిరి, బాలానగర్

 మన జీవనాధారానికి, రోజువారీ పనులకు చేతులు, వేళ్లు చాలా కీలకం. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చేతులు లేకపోతే మన పని మనమే చేసుకోలేం. ఒకవేళ చేతులు ఉన్నా వాటికి వేళ్లు లేకపోతే జీవనాధారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మీ విషయంలో కూడా అలాగే జరిగింది. అయితే మీరు ఏమాత్రం నిరాశపడవద్దు. మీ కుడిచేతికి సంబంధించి, ఏ వేళ్లుపోయాయో వాటిని మీరు తిరిగి పొందగలరు. ‘రీ కన్‌స్ట్రక్షన్ సర్జరీ’ ద్వారా మీ చేతివేళ్లను అతికించవచ్చు. అయితే మీ కాళ్లలో ఏది సెట్ అవుతుందో చూసి, దాన్ని తీసి సర్జరీ ద్వారా మీరు కోల్పోయిన చేతి వేళ్లను అమర్చవచ్చు. పనిచేయడానికి చేతులకు కావాల్సిన బొటనవేలు, చూపుడువేలితో పాటు చివరి రెండు వేళ్లూ ముఖ్యమైనవే. వాటిని తిరిగిపొందాలంటే మీరు నిపుణులైన ప్లాస్టిక్, వాస్క్యులార్ సర్జన్ల బృందాన్ని సంప్రదించాలి. వారు యాక్సిడెంట్‌కు గురైన మీ చేతిని పరీక్షించి శస్త్రచికిత్స చేసే వీలుని పరిశీలిస్తారు. సర్జరీ నిర్వహించిన వేలిని శరీరం స్వీకరించడం, ఎముకకు సరిగ్గా అతకడం, నరాలు, రక్తప్రసరణ వంటి విషయాలనూ డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆపరేషన్ చేసిన వేళ్లతో మీరు మునుపటిలాగే పనులు చేసుకోవచ్చు. ఒక్కోసారి మీరు కోల్పోయిన అన్ని వేళ్లకూ ఒకేసారి సర్జరీ చేసే అవకాశాలూ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత ఒక నెలరోజుల పాటు మీరు ఆ వేళ్ల విషయంలో జాగ్రత్తవహిస్తే మీరు మునుపటిలాగానే ఉద్యోగం చేస్తూ, మీ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి  గట్టెక్కించగలుగుతారు. ఒకసారి ప్లాస్టిక్ సర్జన్స్, వాస్క్యులార్ సర్జన్స్ బృందం ఉన్న హాస్పిటల్‌ను సంప్రదించండి.
 
డాక్టర్ శశికాంత్ మద్దు
సీనియర్ ప్లాస్టిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్
సోమాజీగూడ
హైదరాబాద్
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. ఇది క్రమంగా పెరుగుతోంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు దాదాపు రూ. 15,000 ఉంటుందంటున్నారు. అంత ఖరీదైన ఇంజెక్షన్స్‌ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి.
 - నవనీతరావు, హైదరాబాద్
 మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి కేవలం లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేయగలవు. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని ఒకింత తగ్గిస్తాయి. మిగతా కార్టిలేజ్‌ను బలం పుంజుకునేలా చూస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి.
 
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్
హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement