పే లేటర్, క్రెడిట్–డెబిట్ కార్డులతో వాయిదా చెల్లింపు ఆప్షన్
ఈ–కామర్స్ కంపెనీల బాటలోనే వినూత్న ఆఫర్లు...
సింపుల్, లేజీ పే తదితర సంస్థలతో జట్టు...
చెంగు చెంగున మార్కెట్లో దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ కంపెనీలు... కస్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ సంస్థల రూట్లోనే కొంగొత్త పేమెంట్ పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా మార్కెట్‌ను మరింత ‘క్విక్’గా కొల్లగొట్టాలనేది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, జొమాటో బ్లింకిట్ తదితర దిగ్గజాల ప్లాన్!!
పదే పది నిమిషాల్లో పక్కా డెలివరీ అంటూ దుమ్మురేపుతున్న క్విక్ కామ్ సంస్థలు.. ఈ–కామర్స్ దిగ్గజాలకు పక్కలో బల్లెంలా మారుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ల విషయంలోనూ ‘నీవు నేర్పిన విద్యే..’ అన్న చందంగా తయారైంది వాటి వ్యూహం. రూ. 2,999 పైబడిన కొనుగోళ్లకు బ్లింకిట్ గత నెలలో నెలవారీ వాయిదా (ఈఎంఐ) ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తొలిసారి 2016లోనే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టగా... అమెజాన్ కూడా 2018లో దీన్ని అనుసరించింది. పలు డెబిట్ కార్డులతో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కూడా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమలు చేస్తున్నాయి. ‘ఈఎంఐ అవకాశం కలి్పంచడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది’ అని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా పేర్కొన్నారు.
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి!
మరోపక్క, దాదాపు దిగ్గజ క్విక్ కామర్స్ కంపెనీలన్నీ ఈఎంఐ ఆప్షన్‌తో పాటు తర్వాత చెల్లించే (బై నౌ, పే లేటర్) పేమెంట్ విధానాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకోసం సింపుల్, పేయూకి చెందిన లేజీ పే వంటి కంపెనీలతో జట్టుకట్టాయి. ఫ్లిప్‌కార్ట్ 2017లో ఈ పే లేటర్ ఫీచర్ ద్వారా యూజర్లకు రూ. లక్ష వరకు ఇన్‌స్టంట్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
నయా పైసా చెల్లించకుండా ఉత్పత్తులను కొనుగోలు చేసి, తర్వాత నెలలో పూర్తిగా చెల్లించడం, లేదంటే ఈఎంఐగా మార్చుకునే అవకాశాన్ని ఇది కలి్పస్తోంది. ఇక 2020లో ప్రవేశపెట్టిన ‘అమెజాన్ పే లేటర్’ కూడా బాగానే ‘‘క్లిక్’ అయింది. కాగా, ఈ పేమెంట్ ఆప్షన్లతో క్యూ–కామ్ సంస్థల సగటు ఆర్డర్ విలువ పెరగడంతో పాటు ఎక్కువ రేటు గల ఉత్పత్తి విభాగాల్లోకి కూడా విస్తరించేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీలు గనుక కస్టమర్ల విశ్వాసాన్ని పొందగలిగితే, ఈకామర్స్ దిగ్గజాలకు సవాలుగా నిలవడం ఖాయమని కూడా వారు
విశ్లేషిస్తున్నారు.
40 బిలియన్ డాలర్లు
భారత్ క్విక్ కామార్స్ మార్కెట్‌ను ప్రధానంగా మూడు కంపెనీలు (జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో) శాసిస్తున్నాయి. ప్రస్తుతం 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక అంచనా.
75% స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు వాయిదాల్లోనే...
‘పే లేటర్, ఈఎంఐ ఫార్మాట్ల వల్ల క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు.. సంప్రదాయ ఈకామర్స్ దిగ్గజాలతో మరింతగా పోటీపడేందుకు వీలవుతుంది. ముఖ్యంగా పే లేటర్ సదుపాయం వల్ల యూజర్ల మెరుగైన షాపింగ్ అనుభూతికి తోడ్పడుతుంది. ఇక స్మార్ట్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, గృహోపకారణాల వంటి అధిక ధర కేటగిరీ కొనుగోళ్లలో ఈఎంఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఈకామర్స్ మాదిరిగానే పోటాపోటీ ధరలతో పాటు అనువైన పేమెంట్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేయడం ద్వారా క్యూకామ్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోగలుగుతాయి’ అని డేటమ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు సతీష్ మీనా అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు దేశంలో 75 శాతం పైగా స్మార్ట్ ఫోన్లు ఈఎంఐ రూట్లోనే అమ్ముడవుతుండటం విశేషం! అయితే, ప్రస్తుతం క్విక్ కామ్ ప్లాట్‌ఫామ్స్‌లో జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మేర కిరాణా, నిత్యావసర ఉత్పత్తులేనని, ఈ పేమెంట్ ఆప్షన్లు తక్షణం వాటికి పెద్దగా ఉపయోగకరం కాదనేది మరో టాప్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుడి అభిప్రాయం. ‘రానురాను ప్రీమియం విభాగాల్లోకి విస్తరించే కొద్దీ పే లేటర్, ఈఎంఐ వంటి ఆప్షన్లు క్విక్ కామ్ డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడతాయి. ఇది ఈకామర్స్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే అవి మరిన్ని వినూత్న విధానాలను అనుసరించక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.
ఈఎంఐ అవకాశం కల్పించడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది.
– అల్బిందర్ ధిండ్సా, బ్లింకిట్ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment