లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
► కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరిక
► స్కానింగ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశం
కర్నూలు(హాస్పిటల్): నింబంధనలను అతిక్రమిస్తున్న స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులపై కఠినంగా వ్యవ హరిం చాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. పీసీ పీఎన్‌డీటీ చట్టంపై శనివారం ప్రాంతీయ శిక్షణా కేం ద్రం(మేల్)లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టబోయే ఆడబిడ్డను గర్భంలోనే చంపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీ పీఎన్‌డీటీ యాక్ట్ ప్రకారం లింగనిర్ధారణ తీవ్రమైన నేరమని, ఇలాంటి ఉదంతాలను ఉపేక్షించకూడదన్నారు.
సోమవారం నుంచి వారం పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనకు రహస్యంగా నివేదిక ఇవ్వాలని నోడల్ అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలున్నారన్నారు. ఏపీలో ఈ నిష్పత్తి 1000ః943, జిల్లాలో 1000ః 930గా ఉండడం ఆందోళన కల్గిస్తోందన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ యు. రాజాసుబ్బారావు, సీపీఓ, జెడ్పీ సీఈఓపాల్గొన్నారు.
సమావేశం నిర్వహించే పద్ధతి ఇదేనా..
ముందస్తు వివరాలు, చట్టానికి సంబంధించిన కాపీలు, ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా పీసీ పీఎన్‌డీటీ చట్టంపై నోడల్ ఆఫీసర్లుగా ఉన్న జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారంటూ జిల్లా కలెక్టర్ మండిపడ్డారు. వారికి ప్రొసీడింగ్స్, జాబ్‌చార్ట్, పీసీ పీఎన్‌డీటీ చట్టానికి సంబంధించిన వివరాలు సోమవారంలోగా అందించాలని కోరారు.