నగరంలోని లింగ నిర్ధారణ చేస్తూ పట్టుబడిన ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కేసు విచారణ పూర్తయినట్లు తెలిసింది.
వైద్య ఆరోగ్య శాఖాధికారులపై ఒత్తిళ్లు
కేసును నీరుగార్చేందుకు కుట్ర
కలెక్టర్ నిర్ణయం మేరకే చర్యలు
అనంతపురం సిటీ : నగరంలోని లింగ నిర్ధారణ చేస్తూ పట్టుబడిన ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కేసు విచారణ పూర్తయినట్లు తెలిసింది. విచారణ నివేదిక బుధవారం కలెక్టర్ కార్యాలయానికి చేరినట్లు సమాచారం. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది ఇక కలెక్టర్‌దే అంతిమ నిర్ణయం. వివరాల్లోకెళితే.. అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ మొదటి కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రెండోసారి గర్భం దాల్చిన ఆమె తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని నిర్థారించుకునేందుకు ఏప్రిల్ ఒకటో తేదీన నగరంలోని అహ్మద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులను ఆశ్రయించింది.
కాగా అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యురాలు లక్ష్మీకాంతం సూచనల మేరకు రెండో తేదీన లింగనిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో గర్భంలో ఉన్నది ఆడ శిశువని తేలింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. మూడో తేదీన గర్భస్రావం (అబార్షన్) చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఇదే సమయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ ఆకస్మిక తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘించడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో నలుగురు ప్రముఖ వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయించారు. ఈ విచారణలో వైద్యురాలు ‘ఆక్సీటోసిన్’ని అనే గర్భస్రావం జరిగేందుకు వినియోగించినట్లు తెలిసింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలన్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు దర్యాప్తుని ముమ్మరం చేశారు. సరిగ్గా మూడు నెలల్లో విచారణను పూర్తి చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేత ఒకరు రంగంలోకి దిగి వైద్యాధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది.