
సాధారణంగా ఎవరైనా తక్కువగా మాట్లాడితే.. వాడి మనసులో మాట తెలుసుకోవడం చాలా కష్టం రా బాబూ అంటుంటాం. అయితే అలాంటి వారి మనసులో మాట కూడా బయటపెట్టొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. ఎలా అంటే కేవలం శరీరాన్ని స్కాన్ చేయడం ద్వారా మనసులో మనం ఏం ఆలోచిస్తున్నాం.. మన ఫీలింగ్స్‌ను కూడా తెలుసుకోవచ్చట. భవిష్యత్తులో రాబోయే కెమెరాలు.. చిన్న చిన్న పరికరాల ద్వారా ఇది సాధ్యపడుతుందని డాల్బీ ల్యాబ్స్ అధినేత, న్యూరో శాస్త్రవేత్త పాపీ క్రమ్ చెబుతున్నారు.
థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, మనసును చదివే ఎలక్ట్రోఎన్‌సెఫాలోగ్రామ్ అనే పరికరాలను ఉపయోగించి మనసును చదివేయొచ్చంటున్నారు. గుండె కొట్టుకునే వేగం.. చర్మానికి అతికించే సెన్సర్ల నుంచి అందే సమాచారం ద్వారా మనసులో ఏం అనుకుంటున్నారో వలంటీర్లను పరీక్షించడం ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. ‘వేరే వ్యక్తికి ఏం తెలుసు.. ఏం చూస్తున్నాడు.. ఏం అర్థం చేసుకున్నాడు.. ఇలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే సంతోషం.. బాధ.. ఇలా మనసులో ఉన్న భావాలన్నింటినీ గుర్తించొచ్చు’ అని పేర్కొన్నారు.
‘ఇప్పటికే సాంకేతికత ద్వారా నిజం నవ్వుకు.. అబద్ధపు నవ్వుకు మధ్య తేడాను గుర్తించాయి.. ఇదే సాధ్యం అయినప్పుడు భావాలను గుర్తిస్తామనడంలో సందేహం లేదు’ అని స్పష్టం చేశారు. అతి త్వరలో మనసును చదివే పరికరాలు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అంటే మన వ్యక్తిగత సమాచారానికే భద్రత లేదని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో మన మనసులో భావాలకు కూడా రక్షణ కరువయ్యే రోజులు దగ్గర పడ్డాయన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment