సాక్షి, గుంటూరు: జిల్లాలో వ్యాధి నిర్ధారణకు ఏర్పాటు చేసే రక్త పరీక్ష కేంద్రాలు, ఎక్స్‌రే, స్కానింగ్ సెంటర్‌లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని లెసైన్స్ కలిగి ఉండాలి. పెరుగుతున్న వ్యాధులకు సమానంగా పరీక్ష కేంద్రాలు పుట్టుకొచ్చాయి. మండల కేంద్రాలతోపాటు, గ్రామాల్లో కూడా వెలుస్తున్నాయి. ఇవి రోగులకు అందుబాటులో ఉంటున్నా వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా లెసైన్స్‌లు లేకుండా నిర్వహించడమే ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ల్యాబ్‌లు, ఎక్స్‌రే సెంటర్‌లు ఏర్పాటు చేయాలంటే సంబంధిత పారామెడికల్ కోర్సులు పూర్తిచేసి సర్టిఫికెట్ పొందాలి. ఆ తరువాతే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి లెసైన్స్ మంజూరు చేస్తారు.
లెసైన్స్ ఫీజుతోపాటు అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పాల్సి రావడంతో వ్యయం ఎక్కు వ అవుతుందని భావిస్తున్న అనేక మంది అనుమతుల జోలికి వెళ్లడం లేదు. మరి కొందరు వేరొకరి సర్టిఫికెట్‌తో లెసైన్స్ పొంది అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయిస్తున్నారు.
వ్యాధి నిర్ధారణలో వైద్య పరీక్షలు కీలకంగా మారిన తరుణంలో అర్హత లేని వ్యక్తులు ఇస్తున్న రిపోర్టులు ఏ మేరకు వాస్తవమనేది ఆలోచించాల్సిన విషయమే. అర్హత లేకుండా తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల సరైన వైద్యం అందక రోగులు మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయని వైద్యులే అంగీకరిస్తున్నారు.
మెడికల్ దుకాణాలు ఇంతే..
మెడికల్ షాపులు సైతం లెసైన్స్ లేకుండా నడుస్తున్నాయి. మరికొందరు వేరేవారి బీఫార్మ్‌సీ సర్టిఫికెట్‌తో లెసైన్స్ సంపాదించి ఎలాంటి అర్హత లేని నలుగురు యువకులను నియమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు రాసిన మందులు అర్థంకాక చేతికొచ్చినవి ఇచ్చి పంపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రోగాలు తగ్గడం మాట అటుంచి కొత్త రోగాలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.
మామూళ్లు అందుకుంటూ...
జిల్లాలో లెసైన్స్‌లు లేని ల్యాబ్‌లు, ఎక్స్‌రే కేంద్రాలు, మెడికల్ షాపులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏదోఒక సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం వీరికి పరిపాటిగా మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ వారిపై చర్యలు తీసుకోకుండా మిన్నకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అధికారులే మామూళ్లు తీసుకుంటూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఇక తమగోడు ఎవరికి చెప్పుకోవాలంటూ రోగులు, వారి బంధువులు వాపోతున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే రోగుల ప్రాణాలు నిలిపిన వారవుతారు.
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం
Published Wed, Nov 19 2014 1:04 AM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM
Advertisement