పల్లెలెట్టా..ఊగుతున్నయంటే..!
మద్యం వ్యాపారులు ఇక నుంచి పల్లెలను మత్తులో ఉంచనున్నారు. ఎక్సైజ్ అధికారుల అనధికార అనుమతితో గ్రామాల్లో వీధివీధినా బెల్ట్‌షాపుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఏకంగా వేలం పాటలు నిర్వహించి కొందరికి మద్యం అమ్ముకునే హక్కు కల్పించారు. వారు ఇక నుంచి ఇంటింటికీ మద్యం సరఫరా చేయాలన్నమాట! వ్యాపారులు, బెల్ట్‌షాపుల నిర్వాహకుల కుటిల ఎత్తులో మందుబాబులు చిత్తు కావడం గ్యారంటీ.
- గ్రామిణులకు చేరువలో బెల్ట్‌షాపులు
- ఉలవపాడు మండలంలో ఇంటింటికీ మద్యం
- వ్యాపారులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న నిబంధనలు
- మత్స్యకార గ్రామాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణకు వేలంపాట
- వ్యాపారుల నుంచి వాటాలు తీసుకుని నిద్రనటిస్తున్న ఎక్సైజ్ పోలీసులు
ఉలవపాడు : పల్లెలన్నీ ఇక మత్తులో ఉండనున్నాయి. గ్రామాల్లో వీధివిధినా బెల్ట్‌షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు అనధికారికంగా మద్యం వాపారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకు ప్రతిఫలంగా అధికారులకు వ్యాపారులు కానుకలు ముట్టజెప్పారు. ఉలవపాడు మండలంలో పరిస్థితి మరీ దారుణం. ఇంటింటికీ మద్యం సరఫరా చేసేందుకు అక్కడి వ్యాపారులు తమ సామ్రాజ్యాన్ని ఇప్పుడిప్పుడే విస్తరించుకుంటున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా బెల్ట్‌షాపులు నిర్వహించేవారు. ఇప్పుడు వాటి నిర్వహణకు వ్యాపారులు కొత్త పంథా ఎంచుకున్నారు. లెసైన్స్ ఉన్న మద్యం వ్యాపారులు గ్రామాలకు వెళ్లి బహిరంగ వేలం నిర్వహించి గ్రామస్తులకు స్థానికంగా మద్యం అమ్ముకునే హక్కు కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో లెసైన్స్ లేకున్నా ఏకంగా మద్యం షాపులనే బహిరంగంగా నిర్వహిస్తున్నారు.
మత్స్యకార గ్రామాలే టార్గెట్
మద్యం వ్యాపారులు మత్స్యకార గ్రామాలను టార్గెట్ చేసుకున్నారు. వేలం పాటలు ఎక్కువగా మత్స్యకార గ్రామాల్లోనే జరిగాయి. గ్రామ పెద్దలకు కొంత నగదు అందజేస్తే వ్యాపారులు మద్యం యథేచ్చగా అమ్ముకోవచ్చు. 5 లెసైన్స్‌డు షాపుల యజమానులు మండలంలోని గ్రామాలను పంచుకున్నారు. షాపును రెండేళ్లు నిర్వహించుకునేందుకు వేలం వేశారు. అలగాయపాలెం బెల్ట్‌షాపును రూ.7 లక్షలు, టెంకాయచెట్లపాలెం రూ.1.5 లక్షలు, కొత్తపల్లెపాలెం రూ.1.70 లక్షలు, బట్టిసోమయ్య పాలెం రూ.90 వేలు, పెదపట్టపుపాలెం రూ.10 లక్షలు, చినపట్టపుపాలెం రూ.2 లక్షలకు పాట నిర్వహించారు. ఉప్పరపాలెం, భీమవరం గ్రామాల్లో లెసైన్స్‌డు షాపు నిర్వాహకులే మద్యం అమ్ముకుంటున్నారు. ఇలా 38 బెల్ట్‌షాపులు ఏర్పాటు చేశారు. వ్యాపారులు రూ.30 లక్షలకుపైనే దండుకున్నట్లు సమాచారం. ఎక్సైజ్ పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని బెల్ట్‌షాపుల నిర్వాహకులకు మద్యం వ్యాపారులు హామీ ఇవ్వడం గమనార్హం.
మేం ఊరుకోం..
బెల్ట్‌షాపులు నిర్వహిస్తే ఊరుకునేది లేదని కొన్ని గ్రామాల ప్రజలు మద్యం వ్యాపారులకు తెగేసి చెప్పారు. గ్రామానికి కొంత డబ్బు ఇస్తామని చెబుతున్నా వారు అంగీకరించడం లేదు. పట్టువదలని విక్రమార్కుల్లా వ్యాపారులు గ్రామ పెద్దల చుట్టూ ఇప్పటికీ తిరుగుతుండటం గమనార్హం. బెల్ట్‌షాపులను వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో కరేడు పరిధిలోని పెదపల్లెపాలెం, రామకృష్ణాపురం ఉన్నాయి.