ఇంటి ముందుకే మందు
ఇంటి ముందుకే మందు
Published Thu, Sep 14 2017 4:17 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
రంగంలోకి ‘మొబైల్ మద్యం’
- ‘బెల్టు’ షాపుల సరికొత్త అవతారం.. హాలోగ్రామ్ లేబుళ్లు తొలగించి సరఫరా
- ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో విక్రయాలు.. లిక్కర్ సిండి‘కేట్ల’ నయా దందా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బెల్టు షాపులు సరికొత్త అవతారంలో జనం ముందుకు వచ్చేశాయ్. కిరాణా షాపులు, పాన్ షాపులు, లాడ్జిలు, మెడికల్ షాపుల్లో మద్యం వ్యాపారాలు చేస్తున్న సిండి‘కేట్లు’ ఇప్పుడు మరో అడుగు ముందుకేశాయ్. మొబైల్ ‘బెల్టు’ షాపులు తెరపైకి తీసుకొచ్చి ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. ఒకేచోట బెల్టు షాపులు నిర్వహిస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో మొబైల్ మందు అమ్మకాలు చేపట్టడం గమనార్హం. ఇలా ఇప్పుడు మొబైల్ మద్యం వ్యాపారం మూడు గ్లాసులు.. ఆరు పెగ్గులు మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ఈ తరహా విక్రయాలతో సిండికేట్ల మధ్య వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. విశాఖపట్టణంలో మద్యం వ్యాపారంలో పట్టున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు నిర్వహించే సిండికేట్‌కు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమాత్యుడి అనుచరుడు నడిపే సిండికేట్‌కు ఇటీవల విభేధాలు తలెత్తి ఆధిపత్య పోరుకు దారి తీసింది.
లేబుళ్లు తొలగించి విక్రయాలు
మొబైల్ విక్రయాల ద్వారా మద్యం అమ్మకాలు ఇటీవల పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బాటిళ్లపై 13 అంకెల బార్ కోడ్ హాలోగ్రామ్ లేబుళ్లను తొలగించి విక్రయాలు సాగిస్తున్నారు. బ్యాచ్, హీల్ నెంబర్లు లేకపోవడంతో మద్యం బాటిళ్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేశారన్నది తెలియడం లేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బార్ కోడ్ నెంబరును ముద్రిస్తే అక్రమ మద్యం విక్రయాలను అరికట్టే వీలుంది. బాటిళ్లపై లేబుల్ లేకపోతే ఎన్డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) మద్యంగా గుర్తించి కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొబైల్ మద్యం విక్రయాలు అధికంగా తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్టణం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో జోరుగా జరుగుతున్నాయి.
ఫిర్యాదులపై చర్యలు ఉత్త ప్రచారమే..
బెల్టు షాపులపై ఫిర్యాదుల కోసం 1100 నంబరు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘ప్రజలే ముందు’ (పీపుల్స్ ఫస్ట్) నినాదంతో ఈ నంబరు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎం కోర్ డ్యాష్ బోర్డు సమాచారం మేరకు ఈ నంబరుకు ఇప్పటివరకు 3,916 బెల్టు షాపులపై ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. ఎక్సైజ్ అధికారులు 3,822 ఫిర్యాదుల్ని పరిశీలించి తనిఖీలు చేపట్టారని, 1,126 షాపులను మూసివేశారని డ్యాష్ బోర్డులో ప్రకటించారు. కానీ బెల్టు షాపులు యధావిధిగా కొనసాగుతున్నాయని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో తుళ్లూరు మండలం ఐనవోలు, తాడేపల్లి ప్రాంతాల్లో పాన్‌షాపులు, జనరల్ స్టోర్లలో మద్యం విక్రయాలు సాగుతూనే ఉన్నాయని మహిళా సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నాయి.
Advertisement
Advertisement