వైన్స్‌ నిల్‌.. ‘బెల్ట్‌’ ఫుల్‌   | Belt Shops In Kamareddy | Sakshi
Sakshi News home page

వైన్స్‌ నిల్‌.. ‘బెల్ట్‌’ ఫుల్‌  

Published Tue, Aug 7 2018 2:44 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Belt Shops In Kamareddy - Sakshi

ఎక్సైజ్‌ అధికారులు, ఊరూరా బెల్టు షాపులు, కామారెడ్డి

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి)/బీబీపేట(కామారెడ్డి) :  మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బెల్టు షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. ఈ దందా దర్జాగా సాగుతోంది. అధికారుల కన్నుసైగలలోనే ఈ తంతు కొనసాగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెతి చూడడం లేదు.

కామారెడ్డి జిల్లాలో 37 వైన్స్‌ దుకాణాలు, మూడు బారులు కొనసాగుతున్నాయి. అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్నారని తెలుస్తోంది. ప్రతి నెల ముడుపులు అందడంతో వారు బెల్టు దుకాణాలపై దృష్టి సారించడం లేదని స్పష్టమౌతుంది. మద్యం షాపుల ప్రతి నెల రూ.30 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. వైన్స్‌లలో మద్యం సేవించ రాదు, బార్లలో సీల్డ్‌ మద్యం అమ్మరాదు. వైన్స్‌కు సంబంధించి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలు, బార్లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటలవరకు అమ్మకాలు చేపట్టాలి అనే నిబంధనలు విధించారు.

ఇవి కాకుండా బయట ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయించరాదని ఆదేశాలున్నాయి. అయినా ఆ నిబంధనలు నిర్వాహకులు  పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.  గ్రామాల్లో బెల్టు షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలి డబ్బులతో మద్యం తాగుతూ సంసారాలను పాడు చేసుకుంటున్నారు

సంపాదన మద్యానికి ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే బెల్టు షాపులకు చేరుకొని ఉద్దెర పెట్టి అప్పుల పాలవుతున్నారు. 

అధిక ధరలకు విక్రయాలు..

మద్యం ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. దీంతో ప్రజారోగ్యానికి చిల్లు పడుతోంది. బెల్టు షాపుల్లో ప్రతి క్వార్టర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు, ఒక్కో బీరు సీసా మీద రూ. 20 అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చీప్‌ లిక్కర్‌ విక్రయాలు బాగా పెరిగాయి. వాటిలో కూడా కల్తీ మద్యం కలుపుతూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. 

పేరుకే కిరాణం.. అమ్మేది మద్యమే.. 

అనేక మంది పేరుకు కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బస్టాండ్‌లలోనే బెల్టు షాపులు నిర్వహిస్తుండటం, రాత్రయితే అక్కడ పండుగ వాతావరణంలా కనపడుతూ చుట్టు పక్కల ఉన్న కాలనీవాసులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణ దుకాణాల్లో, సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లు పెట్టుకొని మరీ విక్రయిస్తుండడం చాలా ఉన్నాయి.

మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మద్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మహారాష్ట్ర నుంచి కల్తీ మద్యం తెప్పించి అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంచుమించూ ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి ఊరంతా ఏరులై పారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. 

పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు

బెల్టు షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఎన్ని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు అనే పూర్తి సమాచారం ఎక్సైజ్‌ అధికారుల వద్ద ఉన్నా ఇప్పటివరకు ఏ బెల్టు షాపుపై దాడులు చేసిన దాఖలాలు లేవు. బెల్టు షాపుల నిర్వాహకుల దగ్గర మామూళ్లు తీసుకోవడంతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వెలుస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

బెల్టు దుకాణాలు నిర్వహిస్తే బైండోవర్‌ 

నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ మద్యం విక్రయాలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. కేసు నమోదు చేసి తహసీల్దార్‌ ఎదుట బైండెవర్‌ చేస్తున్నాం. బెల్టు దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటాం. చట్టానికి ఎవరూ అతీతులు కారు.                    –శ్రీనివాస్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

బెల్టు షాపులకు అనుమతులు లేవు 

గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. ఒకవేళ అమ్ముతున్నారని ఎవరైనా సమాచారం అందిస్తే బెల్టు షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

–రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్‌ సీఐ, దోమకొండ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement