గులాబీ కండువా ప్రజలకు శ్రీరామ రక్ష
⇒ చంద్రబాబుది పూటకో మాట
⇒ నిజామాబాద్ ఎంపీ కవిత
⇒ బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు
బెల్లంపల్లి/ఆసిఫాబాద్ : గులాబీ కండువా రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని నిజామాబాద్ ఎంపీ, టీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. బెల్లంపల్లిలోని బాలాజీ మినీ ఫంక్షన్ హాల్‌లో, ఆసిఫాబాద్‌లోని జెడ్పీ గ్రౌండ్ ఆవరణలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల నుంచి వలసలు ఆరంభమయ్యాయని, పాత, కొత్త కలయికతో టీఆర్‌ఎస్ ముందుకు సాగుతోందని చెప్పారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని తెలిపారు. ఒక్కో కార్యకర్త వంద మందిని సభ్యులుగా చేర్పించాలని, గడపగడపకు వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుది పూటకో మాట అని విమర్శించారు. సమయాన్ని బట్టి రెండు కళ్ల సిద్ధాంతం అవలంబి స్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
ఆంధ్రా పార్టీలు లేని తెలంగాణ ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీనిచ్చా రు. ఆంధ్రా పాలనలో ఆసిఫాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం జిల్లాకు వెయ్యి కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. కాగా, ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పి.సునీతారాణి, టీఆర్‌ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ స భ్యుడు పురాణం సతీశ్, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి సయ్యద్ అక్బర్‌హుస్సేన్ , నాయకులు ఆర్.ప్రవీణ్, ఎస్.నర్సింగం, సురేశ్, టీఆర్‌ఎస్వీ జిల్లా నాయకులు పోలు భరత్‌చంద్ర, ఆసిఫాబాద్‌లో పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జెడ్పీటీసీల ఫో రం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల హేమాజి, రైతు సంఘం నాయకులు గోవర్ధన్‌రెడ్డి, రేణుకుంట్ల ప్రవీణ్, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యు లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి బలోపేతానికి కృషి
మంచిర్యాల టౌన్ : గ్రామగ్రామాన తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తామని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. గురువారం మంచిర్యాల టీఎన్జీవోస్ భవన్‌లో నిర్వహించిన జాగృతి జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటి వరకు 1.20 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు. కవిత వెంట జాగృతి తూర్పు జిల్లా అధ్యక్షుడు ప్రేంరావు, సభ్యులు తిరుమల, పుష్ప, విజయలక్ష్మి, సతీశ్, సిరిపురం రాజేశ్ ఉన్నారు.
రాచకొండ కుటుంబానికి పరామర్శ
శ్రీరాంపూర్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు కుటుంబాన్ని ఎంపీ కవిత పరామర్శించారు. నస్పూర్‌లోని వారి ఇంటికి వెళ్లి కృష్ణారావు భార్య మంజుల, పిల్లలను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె వెంట ఎమ్మెల్యే దివాకర్‌రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు పురా ణం సతీశ్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూ మారెడ్డి, ఎంపీపీ బేర సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి ఉన్నారు.
పక్క రాష్ట్ర సీఎంకు ఇక్కడేం పని..?
పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు కు తెలంగాణ రాష్ట్రంతో పనేందని నిజామాబా ద్ ఎంపీ కవిత ప్రశ్నించారు. ఆంధ్ర సీఎం తెలంగాణలో పర్యటించడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు ఇక్కడ మిగిలింది ఇద్దరు ముగ్గురే న ని.. మరి కొన్ని రోజుల్లో వారు కూడా ఉండరన్నారు.