జయమేనా! | grandly welcome to jaya nama year | Sakshi
Sakshi News home page

జయమేనా!

Published Tue, Apr 1 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

grandly welcome to jaya nama year

సాక్షి, మంచిర్యాల/బెల్లంపల్లి : శ్రీ జయ నామ సంవత్సరంలో తమను విజయం వరించాలని మున్సిపాలిటీ ఎన్నికల అభ్యర్థులు ఆశిస్తున్నారు. కీలక ఎన్నికల ఘట్టం ముగిసినా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆరంభం కాకముందే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు, ఓటమిలపై జోరుగా విశ్లేషణలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు చేస్తూ పోలింగ్ సరళిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడం ద్వారా తమకు అయిన ఖర్చులు లెక్కేస్తూ సోమవారం బిజీబిజీగా గడిపారు. ఓట్ల ద్వారా తేలే భవిష్యత్తుతోపాటు పంచాగం తమ గురించి ఏం చెబుతుందోనని మరికొందరు ఉగాది పంచాంగాలను ఆశ్రయించారు. పుర ఎన్నికల ఫలితాల ప్రకటనపై మంగళవారం వెలువడనున్న కోర్టు తీర్పుపై అన్ని పార్టీల అభ్యర్థుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 ‘కట్టలు’ తెగిన వ్యయం
 పురపాలక బరిలో నిలిచిన అభ్యర్థులు ఖర్చులు ఆకాశాన్నంటాయి. ఎన్నికల అధికారులు నిర్దే శించిన రూ.లక్ష పరిమితి మేరకే ఖర్చు పెట్టామని అభ్యర్థులు చెప్తున్నా స్థానాన్ని బట్టి వాస్తవ ఖర్చు అంతకు ఐదు నుంచి పది రేట్లు అధికంగా ఉంటుంది. కౌన్సిలర్‌గా బరిలో నిలిచిన వారికి  సగటు ఖర్చు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు చేరిందని నాయకుల అనుచరులు పేర్కొంటున్నారు. చైర్మన్ స్థానంపై గురిపెట్టిన అభ్యర్థులు గెలుపే ల క్ష్యంగా రూ.10 లక్షల నుంచి రూ.15 ల క్షల దాకా సొమ్ములు గుమ్మరించారని ఆయా మున్సిపాలిటీల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్థానాన్ని బట్టి ఒక్కో ఓటుకు రూ.1000 నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేశారు. సగటున ఓక్కో ఓటుకు రూ.500-రూ.1000 చొప్పున నాయకులు పంపిణీ చేశారు. ఈ లెక్కన రూ. కోట్లు ఖర్చు చేశారు. ఈ ఖర్చులను భరించేందుకు కొందరు చేతిలో ఉన్న సొమ్ములు ఉపయోగిస్తే మరికొందరు కూడబెట్టిన సొమ్మును బయటకు తీశారు. మరికొందరు తమకున్న ప్లాట్లను, స్థిరాస్తులను అమ్మి పోటీలో నిలిచారు. ఇంకొందరు గెలుస్తామనే ధీమాతో అప్పులు కూడా చేశారు.

 మందు.. విందుకు భారీ ఖర్చు..
 జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికల కోసం అభ్యర్థులు నామినేషన్ల నుంచి పోలింగ్ రోజు వరకు భారీగా ఖర్చు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, బైంసా, కాగజ్‌నగర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లోని 187 వార్డులకు ఎన్నికలు జరగగా 1,095 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇదివరలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అభ్యర్థులు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు.  ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. హోరాహోరీగా ప్రచారం సాగించి ప్రత్యర్థులకు దడ పుట్టించారు.

 విందు, మందు రాజకీయాలు కూడా చేశారు. బిర్యానీల విందు నడిపించారు. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి చోటామోటా నాయకులు, అనుచరుల ద్వారా ఓటర్లకు మందు పంపిణీ చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. మహిళలను ఆకట్టుకునేందుకు చీరల పంపిణీ జోరుగా సాగింది. వార్డుల్లోని మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మహిళా నాయకుల ద్వారా చేరవేశారు. డ్వాక్రా సంఘాల వారిని ప్రసన్నం చేసుకునేందుకు సంబంధిత సంఘంలోని ముఖ్యులతో మంతనాలు జరిపారు. వారికి పలు ఆఫర్లతోపాటు పెద్ద ఎత్తున సొమ్ములు ముట్టజెప్పినట్లు జోరుగా ప్రచారం జరిగింది.

 అభ్యర్థుల్లో గుబులు
 ఈసారి ఎన్నికల్లో ఓటర్లు అంచనాకు మించి పోలింగ్‌లో పాల్గొనడంతో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల్లో గుబులు పట్టుకుంది. విజయావకాశాలు ఏ తీరుగా ఉంటాయోనని తర్జనభర్జన పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ఓటరు మనోగతం బయటపడలేదు. అందరూ అభ్యర్థులను ఓటర్లు సమానంగానే ఆదరించారు. హోరాహోరీగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చి ఓటు వేయడంతో అనుహ్యంగా పోలింగ్ శాతం పెరిగింది. ఓటర్లు తమనే ఆదరించారని ఓ ప్రధాన రాజకీయ పక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే విజయం తమ పార్టీదేనని మరో రాజకీయ పక్షం అంచనా వేస్తోంది. యువ ఓటర్లు ఈసారి తమవైపే మొగ్గుచూపారని మరో రాజకీయ పక్షం చెప్పుకుంటోంది. ఇలా ఎవరికి వారు గెలుపుపై త ధీమా వ్యక్తం చేస్తున్న అంతర్గతంగా మాత్రం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

 క్రాస్ ఓటింగ్‌పై ఆందోళన
 మున్సిపల్ ఎన్నికల్లో ఈ పర్యాయం క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రధాన వార్డుల్లో ముఖ్యమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజకీయ పక్షాల్లోని అంతర్గత విభేదాలు  పుర ఎన్నికల్లో పొడచూపినట్లు సమాచారం. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఏమాత్రం అనుమానం రాకుండా క్రాస్‌ఓటింగ్ చేయించినట్లు ప్రత్యర్థి గ్రూపు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ విషయాన్ని స్వయంగా రాజకీయ పక్షాల నాయకులు కొందరు అంగీకరిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ ప్రభావం ఏ అభ్యర్థికి అనుకూలంగా మారుతుందోననేది అంతుచిక్కకుండా ఉంది. కాగా, ప్రధాన రాజకీయ పక్షాలకు ధీటుగా పలు వార్డులలో స్వతంత్ర అభ్యర్థులు పోటీ ప్రచారం సాగించారు. ఒకానొక దశలో ప్రధాన పక్షాల అభ్యర్థులకు స్వతంత్రులు ముచ్చెమటలు పోయించారు. కొందరు అభ్యర్థులు రెబల్స్‌గా పోటీ చేయగా మరికొందరు స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో సామాజిక వర్గం, అర్థబలం ప్రధానంగా పని చేసినట్లు సమాచారం.

 బెట్టింగ్‌ల జోరు
 జిల్లాలోని ఎన్నికలు జరిగిన ఆరు మున్సిపాలిటీల్లో గెలుపోటములపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన అభ్యర్థే విజయం సాధిస్తాడని.. కాదు.. కాదు.. తమ పార్టీకి చెందిన మావోడే గెలుస్తాడని బెట్టింగ్‌లు కడుతున్నారు. ఇంకా స్వతంత్ర అభ్యర్థులను విజయం వరిస్తుందని పందెం కాాస్తున్నారు. రూ. 10 వల నుంచి రూ.లక్ష వరకు పందెం కాస్తున్నారు.

 ఫలితాలపై ఉత్కంఠ
 బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయని అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నాయకులు భావిస్తున్నారు. దీనిపై ఆసక్తిగా ఉన్న నాయకులకు కోర్టు తీర్పు పచ్చి వెలగకాయ వలే అడ్డుగా ఉంది. మంగళవారం న్యాయస్థానం వెలువరించే తీర్పు ఆధారంగా ఫలితాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయం ఆధారంగా అభ్యర్థులు, పలువురి నాయకుల జాతకం బయటపడనుంది. ఇదిలాఉండగా అధికారులు మాత్రం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారులకు మంగళవారం కౌంటింగ్‌పై శిక్షణను అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement