గడ్డపారతో బ్యాంకు లోనికి వెళ్తున్న అగంతకుడు
సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకులో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. బెల్లంపల్లి ఏసీపీ వి.బాలుజాదవ్ వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2:05 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి టీషర్టు, ప్యాంటు ధరించి ముఖం కనబడకుండా వస్త్రం కట్టుకుని బ్యాంకు ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న గడ్డపారతో తాళాన్ని పగులగొట్టి షెటర్‌ను పైకి లేపి లోనికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన అగంతకుడు నేరుగా డబ్బు భద్రపర్చి ఉన్న లాకర్ల వద్దకు వెళ్లి పగులగొట్టేందుకు యత్నించాడు.
గడ్డపారతో లాకర్‌ను తెరవడానికి శతవిధాల ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే ప్రధాన ద్వారం పక్కనే ఉన్న ఏటీఎం గది వద్దకు వచ్చాడు. ఏటీఎం గదిని ధ్వంసం చేసి లోనికి వెళ్లడానికి యత్నించే క్రమంలో సైరన్ మోగింది. ఆన్‌లైన్ సెక్యూరిటీ ఫోన్ ముంబై నుంచి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రాములు, ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ ప్రసాద్‌కు ఏకకాలంలో వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎస్‌హెచ్‌వో సిబ్బందితో హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆ లోపే అగంతకుడు పరారయ్యాడు.
ఫింగర్ ప్రింట్స్ సేకరణ..
ఆన్‌లైన్ సెక్యూరిటీ ఫోన్ అలర్ట్ చేయడంతో ఎస్‌హెచ్‌వోతో పాటు బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ఏకకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోనికి వెళ్లి ఏం జరిగిందో పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు లాకర్లను తెరవడానికి గడ్డపారతో చేసిన తవ్వకాలు, ధ్వంసం చేసిన పరికరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించారు. తెల్లవారుజామున జాగిలాన్ని రప్పించి వ్యక్తి ఆచూకీ కోసం యత్నించారు. జాగిలం బ్యాంకు పక్కనే ఓ వీధి వరకు వెళ్లి వెనక్కివచ్చింది. అగంతకుడు ఆ వీధిలోంచి పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
సీసీ ఫుటేజీ పరిశీలన..
చోరీ జరిగిన తర్వాత పోలీసులు నేరుగా బ్యాంకులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అగంతకుడు ఎక్కడి నుంచి బ్యాంకులోకి ప్రవేశించాడు, డబ్బుకోసం యత్నించిన తీరును ఎస్‌హెచ్‌వోతో పాటు ఏసీపీ బాలుజాదవ్ సీసీ కెమెరాల్లో చూశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. లావుగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కడే బ్యాంకులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. కాని బయట ఇంకెవరైనా ఉన్నారా లేదా ఒక్కడే ఈ సాహసానికి ఒడిగట్టాడా అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు.
సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో..
బ్యాంకుల వద్ద గతంలో రాత్రిపూట సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహించేవాడు. కాని కొన్నాళ్ల క్రితం నుంచి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును తొలగించారు. దీంతో అగంతకుడు రాత్రిపూట చోరీకి యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పట్టణంలో రాత్రిపూట పోలీసు గస్తీ ఉన్నా అగంతకుడు బ్యాంకు చోరీకి యత్నించి పోలీసులకు సవాల్ విసిరినంత పనిచేశాడు.
బ్యాంకుల వద్ద పాయింట్ బుక్ పెడతాం..
బ్యాంకుల వద్ద భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డు ఉంటే అగంతకుడు చోరీకి యత్నించేవాడు కాదన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సెక్యూరిటీ గార్డును నియమించేలా చూస్తామన్నారు. పెట్రోలింగ్ పోలీసులు రాత్రిపూట బ్యాంకును విధిగా తనిఖీ చేయడానికి పాయింట్ బుక్ పెడతామని వెల్లడించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment