అరెస్టయిన అప్రైజర్ రమేశ్ ,స్వాధీనం చేసుకున్న నగలను పరిశీలిస్తున్న ఎస్పీ సెంథిల్‌కుమార్
మనిషికి ఉన్న వ్యసనాలు వారిపతనానికి దారితీస్తాయనడానికియాదమరి మండలంలోని మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు చోరీ ఘటనేనిదర్శనం. తొలినుంచి ఈ కేసులోఅందరూ మేనేజర్‌నుఅనుమానించగా.. చివరకు అతను నిర్దోషిగా బయటపడ్డాడు. బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న విగ్రహాల రమేష్ ఆచారి (45)ను పోలీసులు బుధవారం అరెస్టుచేశారు.
చిత్తూరు అర్బన్: యాదమరి ఆంధ్రా బ్యాంకులో చోరీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నిందితుడు అప్రైజర్‌ను అరెస్టు చేసిన అనంతరం చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి వివరాలనువెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుకు చెందిన రమేష్ చదువుకుంది తొమ్మిదో తరగతి. త్వరగా రూ.కోట్లకు పడగెత్తాలన్నది అతని ఆకాంక్ష. 12 ఏళ్ల క్రితం నెల్లూరులో ఓ సినిమాకు సంబంధించి బాక్సు కొని చేతులు కాల్చుకున్నాడు. అటు తరువాత హోటల్ పెట్టినా త్వరగా కోటీశ్వరుడు కాలేకపోయాడు. కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం చిత్తూరుకు చేరుకుని దూరపు బంధువుల ద్వారా ఇక్కడే స్థిరపడ్డాడు. స్నేహితుల సాయంతో 2015లో ఆంధ్రా బ్యాంకులో అప్రైజర్ (ఆభరణాల విలువ నిర్ధారకుడు) పోస్టుకు దరఖాస్తు చేసుకుని రూ.2.50 లక్షలు డిపాజిట్‌చేసి ఉద్యోగం సంపాదించాడు. తాను చెప్పిందే బంగారం.. ఎంత కావాలన్నా రుణాలు. ఇక తన జీవితాశయం నెరవేర్చడానికి స్టాక్ మార్కెట్లు ఒక్కటే దారనుకున్నాడు. బ్యాంకుకు వచ్చే రైతులతో పరిచయాలుపెంచుకున్నారు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను రైతుల ఖాతాల్లో పెట్టి రుణాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇదే సమయంలో గత రెండేళ్లలో ఏడు కిలోల బరువున్న గిల్టు నగలను బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1.30 కోట్ల రుణం తీసుకుని షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం ఆవిరైపోయింది. ఇక బ్యాంకు అధికారులు ఆడిట్‌కు వచ్చి నగలు తనిఖీ చేస్తారనే భయం వెంటా డింది. నకిలీ నగలు దొరికిపోతాయని ఓవైపు, అప్పులు తీరాలంటే బ్యాంకులో ఉన్న బంగారు నగలు కూడా కావాలని మరో ఆలోచన రమేష్‌ను చోరీ చేయించి.. ఇప్పుడు దోషిగా నిలబెట్టింది.
‘క్లూ’ కీలకం
ఈనెల 14వ తేదీ బ్యాంకులో 18.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత కొందరు అధికారులపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే బ్యాంకులో తాళాలు తీసి చోరీ చేయడం, సీసీ కెమెరాల ఫుటేజీ రికార్డు అయ్యే హార్డ్ డిస్క్ దొంగలించడంతో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉందని అనుమానించారు. ఓవైపు అందరి గురించి ఆరా తీస్తూనే మరోవైపు రికార్డులు పరిశీలించారు. 11వ తేదీ ఒకే ఒక్క వ్యక్తి రూ.5 లక్షలు చెల్లించి తన నగలను బ్యాంకు నుంచి విడిపించుకెళ్లినట్లు గుర్తించారు. మొబైల్ నంబరును సాంకేతిక పరిజ్ఞానంతో చూస్తే 12వ తేదీన మోర్దానపల్లె సెల్‌టవర్ వద్ద చూపించింది. ఆ నంబరు మరెవరిదోకాదు.. అప్రైజర్ రమేష్‌ది. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పేశాడు. జనవరిలోనే బ్యాంకులో చోరీ చేయాలనుకున్న రమేష్ తాళాలను ముద్రించే క్యాస్టింగ్ ఇసుక, బంగారాన్ని కరిగించే యంత్రం సిద్ధం చేసుకున్నాడు. ఓ రోజు మేనేజరు సెలవుపెట్టి ఇన్‌చార్జ్ మేనేజరుకు తాళాలు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయాడు. రెండు రోజుల పాటు తాళాలు తనవద్దే ఉండడంతో తమిళనాడులోని వేలూరు వెళ్లిన రమేష్ అక్కడ నకిలీ తాళాలు సిద్ధం చేశాడు. ఓసారి క్యాషి యర్ అన్నం తింటుండగా రమేష్ జేబులో క్యాస్టింగ్ ఇసుకను పెట్టుకుని క్యాషి యర్ దృష్టి మరల్చాడు. క్యాషియర్ వద్ద ఉన్న తాళాలను మట్టిలో ముద్రించుకున్నాడు. స్వతహాగా ఆచారి కావడంతో క్యాస్టింగ్ ఇసుకతో ఇత్తడితో తాళాలు తయారు చేసుకున్నాడు. ఈ రెండు తాళాలువేస్తే తప్ప బ్యాంకు తెరుచుకోదు. దీంతో పక్కా ప్రణాళికతో ఈ నెల 12న బ్యాంకులో చోరీ చేశాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజరు, క్యాషియర్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.
పోలీసులు శ్రమ
బ్యాంకులో 442 మంది ఖాతాదారుల నగలు చోరీ కావడంతో ఎస్పీ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. రమేష్ బ్యాంకులో కుదువపెట్టిన ఏడు కిలోల గిల్టు నగలు చిత్తూరులోని కాలువలో పడేయడం, అవి మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చిక్కడంతో వారి నుంచి నకిలీ నగలను రికవరీ చేయడం, చోరీ చేసిన 11.5 కిలోల బంగారు ఆభరణాలతో పాటు తాళాలు, హార్డ్‌డిస్క్, రూ.10.20 లక్షల నగదు, ఓ కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, చిత్తూరు తూర్పు, పశ్చిమ సీఐలు బాలయ్య, ఈశ్వర్‌రెడ్డి, క్రైమ్ సీఐ రమేష్‌కుమార్, భాస్కర్, ఎస్‌ఐలు నెట్టికంఠయ్య, విక్రమ్, రాజశేఖర్‌లు కీలకంగా పనిచేశారు. వీరిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment