మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు
చిత్తూరు అర్బన్ : యాదమరి మండలంలో జరిగిన ఆంధ్రాబ్యాంకు చోరీ కేసు విభిన్న కోణాల్లో మలుపులు తిరుగుతోంది. మండలంలోని మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకులో 17 కిలోల బంగారు నగలు చోరీకి గురైన ఘటనలో అసలు దోషి బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ రమేషేనంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే చోరీలో బ్యాంకు మేనేజర్ పాత్రపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే 11 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మరో 6 కిలోల గిల్ట్ నగలు సైతం చోరీకి గురైనట్లు గుర్తించారు.
బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న చిత్తూరులోని గిరింపేటకు చెందిన రమేష్ బ్యాంకునే మోసం చేసి రూ.కోటికిపైగా నిధులు కాజేసినట్లు విశ్వశనీయ సమాచారం. పలువురి పేర్లతో ఆరు కిలోల బరువున్న గిల్ట్ నగలను బ్యాంకులో కుదువపెట్టి రూ.కోటి వరకు రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు తాళాలను సైతం మేనేజర్ పురుషోత్తం నుంచి ఏమార్చి కాజేసినట్లు సమాచారం. చోరీ సమయంలో బ్యాంకులో తాను కుదువపెట్టిన ఆరు కిలోల గిల్ట్ నగలను సైతం చోరీ చేసిన రమేష్.. వాటిని చిత్తూరు నగరంలోని ఓ మురుగునీటి కాలువలో పడేసాడు. ఇవి ఇద్దరు మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దొరికాయి. వారు వీటిని పంచుకున్నారు. తీరా రమేష్ ద్వారా అసలు విషయం రాబట్టిన పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా ఇద్దరు కార్మికుల వద్ద ఉన్న ఐదు కిలోల గిల్ట్ నగలు, రమేష్ వద్ద ఉన్న ఇంకో కిలో గిల్ట్ నగలను సీజ్ చేశారు. ఇక చోరీ జరిగినప్పటి నుంచి అతని కారులో ఉంచుకున్న 11 కిలోల బంగారు ఆభరణాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చిన ఆంధ్రాబ్యాంకు బంగారు ఆభరణాల చోరీ కేసులో చిన్నపాటి విచారణ పూర్తవగానే నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
నగలు ఇవ్వాలని ఆంధ్రా బ్యాంకు ఖాతాదారుల ఆందోళన
యాదమరి : బ్యాంకులో కుదవకు పెట్టిన తమ నగలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖాతాదారులు సోమవారం ఆం«ధ్రా బ్యాంకు ముందు చేశారు. గత వారం మండలలోని మోర్థానపల్లె వద్ద ఆంధ్రా బ్యాంకులో ఘరానా చోరీ జరగడం విదితమే. ఈ చోరీకి పాల్పడింది సాక్షాత్తు ఇంటి దొంగలేనని, ఈ నగలను కరిగించారనే వార్తలు రావడంతో ఖాతాదారులు ఉదయం బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న యాదమరి ఎస్‌ఐ పురుషోత్తం రెడ్డి తన సిబ్బందితో వెళ్లి ఖాతాదారులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment