బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య శనివారం తూర్పు, పశ్చిమ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి రచ్చబండలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం 10.30 గంటలకు బెల్లంపల్లికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి బెల్లంపల్లి మండ లం గురిజాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన రూ.13కోట్లతో తలపెట్టిన సాంఘిక సంక్షేమ బాలుర విద్యాలయం, రూ.3కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహం, రూ.కోటితో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల వసతిగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం ఆసిఫాబాద్‌కు వెళ్లారు. రూ.40లక్షలతో నిర్మించిన అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్యశాల, కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేశారు. ఆసిఫాబాద్‌లో రూ.6.5 కోట్లతో ఫిల్టర్‌బెడ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.80 లక్షలతో ఆర్‌అండ్‌బీ రోడ్ నుంచి సాలెగూడకు బీటీ రోడ్డు నిర్మాణానికి, వాంకిడి మండలం కనర్‌గాంలో రూ.7.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి కెరమెరి మండలానికి చేరుకున్నారు. కెరమెరిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైనూర్, కెరమెరి మండలాల్లో రూ.1.35 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు భూమిపూజ చేశారు.
రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో మార్లవాయి, కంచెన్‌పల్లి, కోహినూర్ గ్రామాల్లో రూ.1.70 కోట్లతో పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తిర్యాణి మండలం రోంపల్లిలో రూ.40 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, వాంకిడి మండలం బంబరలో రూ.50 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, సిర్పూర్, జైనూర్ మండలాల్లో రూ.3 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఇన్‌చార్జి మంత్రి సుడిగాలి పర్యటన
Published Sun, Nov 24 2013 6:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement