బెల్లంపల్లి : భూగర్భంలో పనిచేస్తున్నకార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై చూపిస్తున్న శ్రద్ధ అధికారులు గనుల్లో రక్షణ చర్యలపై చూపడం లేదు. కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు ప్రమాదాల భారినపడుతున్నారు. మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో కార్మికులు ప్రతికూల పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎవరికి సంభవిస్తుందోననే అభద్రతాభావం కార్మికుల్లో వ్యక్తమవుతోంది.
గత శనివారం రెండో షిప్ట్‌లో 2 డీప్ 55 లెవల్ వద్ద సపోర్టు పనులు నిర్వహిస్తుండగా ఆకస్మికంగా పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఓవర్‌మెన్ మీన సుదర్శన్ ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలు తగలగా, బ్రహ్మేశ్వర్‌రావు అనే బదిలీ ఫిల్లర్ కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ క్షణంలో ఏఎం యంత్రం మరమ్మతులకు రావడంతో పక్కకు వెళ్లిన మరో నలుగురు కార్మికులు తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. బొగ్గు అధికోత్పత్తి సాధనే లక్ష్యంగా పని చేస్తున్న అధికారులు ప్రకృతికి విరుద్దంగా భూగర్భంలో పని చేస్తున్న కార్మికుల ప్రాణాల మీదికి వస్తున్నా పట్టింపు చేయడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణ టీంకే రక్షణ లేదు..
భూగర్భంలో బొగ్గు వెలికితీతకు రక్షణ చర్యలు పటిష్టవంతంగా చేపట్టాల్సి ఉంటుంది. కార్మికులు పనిస్థలాలకు వెళ్లే ముందస్తుగానే రక్షణ టీం సపోర్టు పనులు నిర్వహించాలి. పైకప్పు కూలకుండా డబ్ల్యుస్ట్రాఫ్ రూఫ్ బోల్ట్‌తో బిగించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రక్షణ టీంపైనే ఉంటుంది. ప్రెస్లీ ఎక్స్‌పోజ్డ్(బొగ్గు వెలికితీత తర్వాత ఏర్పడిన ఖాళీ స్థలం)లో రక్షణ పనులు నిర్వహించే సపోర్టు టీం సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది.
సపోర్టు పనులు చేపట్టే ముందు రక్షణ టీం ఖాళీ ప్రదేశంలో దాటు లేదా దిమ్మె, ఫోర్‌ఫోలింగ్‌ను ఏర్పాటు చేసుకొని సపోర్టు పనులు ప్రారంభించాల్సి ఉండగా అలాంటి పద్ధతులు శాంతిఖని గనిలో నిర్వహించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ విధానం కొంత కాలం నుంచి గనిలో చేపట్టడం లేదు. ఈ కారణంగానే రక్షణ టీంకు రక్షణ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అడపాదడపా పైకప్పు కూలి గాయాలపాలవుతున్నారు.
పర్యవేక్షణ లేని డీజీఎంఎస్
భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై పర్యవేక్షణ నిర్వహించే డెప్యూటీ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్) పత్తా లేకుండా పోయారు. మైన్స్ యాక్టు ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి డీజీఎంఎస్ గనులను తనిఖీ చేయాల్సి ఉండగా ఇటీవలి కాలంలో నిర్లక్ష్యం విహ స్తున్నారు. మైనింగ్ ఇన్‌స్పెక్టర్లు గనుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పర్యవేక్షణ నిర్వహించడం లేదు. ఏదో ఏడాదికోసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గనిలో దిగి రక్షణ చర్యలను నిశితంగా పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లిప్తంగా పర్యవేక్షిస్తుండటంతో సింగరేణి అధికారులు చిత్తశుద్ధితో సేఫ్టీ పనులు చేపట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది.
వర్క్‌లేని... వర్క్‌మన్ ఇన్‌స్పెక్టర్లు
మైనింగ్ ఇన్‌స్పెక్టర్లే కాకుండా గని స్థాయిలో ఏర్పాటు చేసిన వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు కూడా సపోర్టు పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. గనిలో వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు వారానికో రోజు సేఫ్టీ పనులను తనిఖీ చేసి రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది. చాలా మట్టుకు గని ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే వీరు పని చేయాల్సి ఉండటం వల్ల ఉన్నతాధికారుల సూచనల మేరకే రిపోర్టులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేఫ్టీ విషయంలో వర్క్‌మన్ ఇన్‌స్పెక్టర్లు సూచనలు, సలహాలు ఇచ్చిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.
వర్క్‌మన్ ఇన్‌స్పెక్టర్లకు స్వయం ప్రతిపత్తి లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఆ రకంగా గనిలో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్‌లో ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు ఉంటాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బండ కింద బతుకులు
Published Wed, Jul 16 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement
Advertisement