ఇళ్ల పట్టాల సమస్య తీరేనా..?
ఇళ్ల పట్టాల సమస్య తీరేనా..?
Published Mon, Oct 17 2016 11:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
దశాబ్దాలు గడిచినా పరిష్కారం కాలేదు
పేదలకు పట్టా ఇవ్వడంలో జాప్యం
సింగరేణి లీజు భూమిలో
నిర్మించుకున్న ఇంటిపై హక్కు లేదు
బెల్లంపల్లి : బెల్లంపల్లిలో ఇళ్ల పట్టాల సమస్య తీవ్రంగా ఉంది. బొగ్గు గనుల తవ్వకాలతో ఉత్పన్నమైన ఆ సమస్య 9 దశాబ్దాలు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. సింగరేణి లీజు భూమిలో శాశ్వత కట్టడాలు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వడంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. ఎన్నోఏళ్ల నుంచి భూమిపై యాజమాన్యపు హక్కును కల్పించడం లేదు. పట్టాలు లేకపోవడంతో నిర్మించుకున్న ఇంటిపై నిరుపేదలు ఎలాంటి హక్కుకు నోచుకోలేకపోతున్నారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకున్న పాపానపోలేదు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల పట్టాల సమస్య అపరిష్కతంగానే ఉంటోంది. కొత్తగా ఏర్పాౖటెనా మంచిర్యాల జిల్లా , బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌పై పుర ప్రజలు పుట్టెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికైన ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారమవుతుందనే ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
బొగ్గు గనుల ప్రస్థానంత
స్వాతంత్య్రానికి పూర్వం 1926 ప్రాంతంలో బెల్లంపల్లిలో బొగ్గు గనుల ప్రస్థానం ఆరంభమైంది. బ్రిటీష్ పాలనలో ఆంగ్లేయ భూగర్భ శాస్త్రవేత్త సర్ విలియం కింగ్ సర్వే చేయడంతో ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. “తాండూర్ కోల్‌మైన్స్’ పేరుతో బొగ్గు గనుల తవ్వకాలు ఆరంభమయ్యాయి. 1927లో మార్గన్స్‌ఫిట్ గనితో బొగ్గు గనుల ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో గ్రామీణులను బలవంతంగా తీసుకొచ్చి మృత్యు గుహల్లాంటి బొగ్గు గనుల్లో దింపి పనులు చేయించేవారు. ఆ తీరుగా సింగరేణి కొలువుచేస్తున్న కార్మికులు, బతుకు దెరువు కోసం కాలరీ ఏరియాకు వలస వచ్చిన కార్మికేతరులు ప్రభుత్వం నుంచి కంపెనీ తీసుకున్న లీజు (ఖాళీ) భూముల్లో పక్కా కట్టడాలు నిర్మించుకున్నారు. ఇప్పటికి 90 ఏళ్లు గడుస్తున్నా నివేశన స్థలాలకు పట్టాలు లేకుండా పోయాయి.
భూమిపై హక్కు లేక
లీజు భూమిలో నిర్మించుకున్న కట్టడాలకు పట్టాలు ఇవ్వకపోవడంతో పేదలకు భూమిపై ఏ మాత్రం హక్కు లేకుండా పోతోంది. కంపెనీలో రెక్కలు, ముక్కలు చేసుకున్న కార్మికులకు స్థిరాస్తి గుంటెడు భూమి లేకుండా పోయింది. కట్టుకున్న ఇంటి స్థలంపై కూడా హక్కు లేకపోవడంతో ఎన్నో ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు. రుణ సదుపాయానికి అర్హులు కాలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లు నుంచి ఇక్కడే నివసిస్తున్న ఎలాంటి హక్కు లేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. చట్టబద్ధమైన హక్కు లేకపోయిన కొందరు మాత్రం భూ క్రయవిక్రయాలు చేస్తున్నారు.
ఎన్నికల హామీగా
ఇళ్ల పట్టాల సమస్య ప్రతి ఎన్నికల్లో హామీగా ఉపయోగపడుతోంది. ఏ ఎన్నికలు వచ్చిన పురప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడం, గెలిచాక విస్మరించడం పరిపాటిగా మారుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో దశాబ్దాల నుంచి హామీలు ఇస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరు, ఎల్లందు, కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సింగరేణి లీజు భూమిలో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలను జారీ చేశారు. ఇందు కోసం ప్రత్యేక జీవోను తెచ్చారు. బెల్లంపల్లిలో మాత్రం ఆ సమస్య అపరిష్కతంగానే ఉండిపోయింది. మంచిర్యాల కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిన బెల్లంపల్లిలో ఇళ్ల పట్టాల సమస్య కొలిక్కి వస్తుందనే ఆశతో ప్రజలు ఉన్నారు.
బెల్లంపల్లి : బి గ్రేడ్ మున్సిపాలిటీ
మున్సిపల్ వార్డుల సంఖ్య : 34
జనాభా : 56,369
మున్సిపాలిటీలోని ఇళ్ల సంఖ్య : 15,250
Advertisement
Advertisement