బెల్లంపల్లి : సింగరేణి కంపెనీ ఆస్తులను ఎస్‌అండ్‌పీసీ విభాగం పరిరక్షిస్తోంది. ఆ విభాగానికి చెందిన కొందరు అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. ఆస్తుల పరిరక్షణ పేరుతో అందినంత దోచుకుంటున్నారు. నిర్భయంగా వసూళ్ల దందా సాగిస్తున్నా రు. బెల్లంపల్లిలో భూగర్భ గనులు మూతపడి, ఏరియా సింగరేణి జీఎం
కార్యాలయాన్ని గోలేటీ టౌన్‌షిప్‌కు తరలించిన తర్వాత మూడేళ్ల నుంచి గృహ, దుకాణ సముదాయాల నిర్మాణాలు సాగుతున్నాయి.
ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న భూములను ఆక్రమించుకొని కొందరు శాశ్వత కట్టడాలు నిర్మిస్తుండగా, శిథిలమైన ఇళ్లను కూల్చివేసి మరికొందరు పక్కా గృహాలు కట్టుకుంటున్నారు. దీంతో బెల్లంపల్లిలో కట్టడాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఎక్కడ నిర్మాణాలు మొదలైనా అక్కడ ఎస్‌అండ్‌పీసీ అధికారులు, సిబ్బంది క్షణాల్లో వాలి కట్టడాలు నిలిపివేస్తారు. సింగరేణి భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారని నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేసి పరికరాలను పట్టుకెళ్తున్నారు. అనంతరం నిర్మాణదారులతో రహస్యంగా బేరసారాలు కుదుర్చుకుంటారు. వ్యాపార, వాణిజ్య వర్గాల వారు ముందస్తుగా అవినీతి అధికారులను సంప్రదించి బేరం కుదిరిన తర్వాతనే నిర్మాణ పనులను చేపడుతారు.
తొలుత అడ్డుకోవడం ఒప్పందం కుదిరిన తర్వాత నిర్మాణం పూర్తయ్యే వరకు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అవినీతి అధికారులకు పరిపాటిగా మారినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. ఆ తీరుగా ఎస్‌అండ్‌పీసీ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు.
బజార్ ఏరియాలో భారీ డిమాండ్
బెల్లంపల్లిలో కన్నాలబస్తీ, టేకులబస్తీ, హన్మాన్‌బస్తీ, బూడిదగడ్డ, ఏఎంసీ ఏరియా, స్టేషన్‌రోడ్ కాలనీ, నంబర్ 2 ఇంక్లైన్‌బస్తీ, సుభాష్‌నగర్, 68 డీప్ ఏరియా, శాంతిఖని, 24 డీప్ ఏరియా, బెల్లంపల్లిబస్తీ, గోల్‌బంగ్లాబస్తీ, బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ ఏరియా, షంషీర్‌నగర్, అంబేద్కర్‌నగర్, బుధాగెస్ట్‌హౌస్ తదితర ప్రాంతాల భూములు సింగరేణి ఆధీనంలో ఉన్నాయి.
వీటిలో కొత్తబస్టాండ్ ఏరియా నుంచి ఏఎంసీ ఏరియా వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలు నిర్మించుకునే వ్యక్తుల నుంచి ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది భారీ మొత్తంలో ముడుపులు డిమాండ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో నిర్మాణానికి కనీసం రూ.20 వేల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. కొందరు వ్యాపార, వాణిజ్యవర్గాల వారు రూ.లక్షలు ముట్టజెప్పి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిరుపేదలు రూ.వేలల్లో చెల్లించుకుంటున్నట్లు సమాచారం.
అంత భారీ స్థాయిలో వసూళ్ల దందా జరుగుతున్నా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించిన పాపాన పోవడం లేదు. ఇదివరలో బెల్లంపల్లిలో పని చేసిన ఓ ఎస్‌అండ్‌పీసీ అధికారి అవినీతి అక్రమాలు బయటపడటంతో సదరు అధికారిని వా రం రోజులు సస్పెన్షన్ చేసి గోలేటీకి బదిలీ చేశారు. మరో ఏరియా ఉన్నతాధికారి రూ.లక్షల్లో ముడుపులు తీసుకొని అక్రమ నిర్మాణాలు ప్రొత్సహించడం అప్ప ట్లోసంచలనం సృష్టించింది.
సదరు అధికారి ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు, సిబ్బందిలో కొందరు ఆ ఆనవాయితీనే కొనసాగిస్తున్నారు. ఏరియా సింగరేణి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ వసూళ్ల దందాను అరికట్టి, సదరు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
వసూల్ రాజాలు
Published Wed, Sep 17 2014 2:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement