సింగరేణిలో దొంగలు పడ్డారు!
సింగరేణిలో దొంగలు పడ్డారు. టన్నులకొద్దీ నల్లబంగారం తవ్వేశారు. ఇక తరలించడమొక్కటే తరువాయి. అంతలోనే విషయం బయటకు పొక్కింది. అక్రమార్కుల గుట్టు రట్టైంది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి- రేచ్నీ ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడి రైల్వేస్టేషన్ నుంచి రెగ్యులర్‌గా కేపీసీఎల్‌కి బొగ్గు రవాణా అవుతుంటుంది. ఇటీవల ఇక్కడే బొగ్గు అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. సింగరేణిలో పని చేసే కొందరు అధికారులు ఈ అక్రమానికి పాల్పడ్డారు.
కేపీసీఎల్‌కి రైల్వే వ్యాగన్లలో 4 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలి. కానీ ఆ బొగ్గు ర్యాక్‌ని మహారాష్ట్రలోని సిమెంట్ పరిశ్రమకి తరలించేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. ర్యాక్ అంటే 54 వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైలు. కేపీసీఎల్‌కు బొగ్గు సరఫరా చేస్తున్నట్లు ఎన్ఓసి తీసుకున్నారు. అయితే ఆ ఎన్ఓసిలో కేపీసీఎల్ అన్న చోట వైట్నర్‌తో కెవిపిటి అని దిద్దేశారు. ఇక వ్యాగన్ కదలడమే తరువాయి. అయితే సింగరేణి ఉద్యోగులు కొందరు ఈ విషయాన్ని నేరుగా సంస్థ సీఎండీకి తెలిపారు. వెంటనే స్పందించిన సీఎండీ విజిలెన్స్ అధికారులను రంగంలోకి దించారు. రవాణాకి సిద్ధంగా ఉన్న రైలును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
ఎన్‌ఓసీపై ఫోర్జరీ సంతకం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న సింగరేణి సెక్యూరిటీ అధికారిని ప్రశ్నిస్తే.. తనకేమీ తెలియదని ముఖం చాటేశాడు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటే ఇదే. సొంత సంస్థకే కన్నాలు వేసేందుకు ప్రయత్నించి దొరికిపోయిన దొంగలకు అధికారులు ఎలాంటి శిక్ష విధిస్తారో వేచి చూడాలి.
**