పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది! | Bellampalli Armed Reserved ACP Cheruku Mallikarjun Turned Singer | Sakshi
Sakshi News home page

Cheruku Mallikarjun: బాధను మరిపించిన పాట..!

Published Wed, Nov 2 2022 12:54 PM | Last Updated on Wed, Nov 2 2022 12:54 PM

Bellampalli Armed Reserved ACP Cheruku Mallikarjun Turned Singer - Sakshi

బెల్లంపల్లి: ఆ ఖాకీ చొక్క హృదయంలో అంతులేని వేదన ఉంది. ఇద్దరు పిల్లలు దివ్యాంగులుగా జన్మించడం వేదనకు గురి చేసింది. ఆ వేదనను దిగమింగి పిల్లల సంతోషం కోసం పాడడం మొదలైంది. పాటలు వింటూ పిల్లలు వైకల్యాన్ని మరిచి ఆనందంతో కేరింతలు కొట్టేవారు. కొన్నేళ్లలోనే ఇద్దరు పిల్లలు దూరం కావడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆ బాధను మరిచిపోవడానికి పాటలు పాడుతూనే ఉన్నాడు. ఆ గాయకుడైన పోలీసు అధికారి రామగుండం పోలీసు కమిషనరేట్‌లోని బెల్లంపల్లి ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌ ఏసీపీ చెరుకు మల్లికార్జున్‌. 


దివ్యాంగులుగా పిల్లలు..

మల్లికార్జున్, శ్యామల దంపతులకు 1996లో తొలి సంతానంగా సాహితీ దివ్యాంగురాలిగా జన్మించింది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా పరిస్థితిలో మార్పు రాలేదు. మంచం, కుర్చీకి పరిమితమై ఉండేది. కొద్దిగా మాట్లాడడం తప్పా భూమిపై అడుగు కదిపేది కాదు. తల్లిదండ్రులు ఆమెకు సపర్యలు చేస్తూ అల్లారు ముద్దుగా చూసుకున్నారు. 2001లో రెండో సంతానంగా మగ బిడ్డ జన్మించాడు. విధి ఆ దంపతులకు పరీక్ష పెట్టింది. హర్షిత్‌ కూడా మానసిక, శారీరక వైకల్యంతో జన్మించడంతో మల్లికార్జున్‌ దంపతుల దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి.

పిల్లల ఆనందం కోసం..
పిల్లలను లాలిస్తూ మల్లికార్జున్‌ ఓ పాట పాడారు. అంతే ఆ ఇద్దరు పిల్లల మోములో ఆనందం తొణికిసలాడింది. అప్పటి నుంచి మల్లికార్జున్‌ పదే పదే పాటలు పాడుతుండడంతో ఆ చిన్నారులు వైకల్యాన్ని మరిచి కేరింతలు కొట్టేవారు. వారి సంతోషం కోసం సినిమా పాటలు నేర్చుకుని ఆలపించేవాడు. ఆ తీరుగా ఏళ్లపాటు కొనసాగగా ఆ చిన్నారుల సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. 18 ఏళ్ల వయస్సులో హర్షిత్‌ 2019లో, కూతురు సాహితీ ఇరవై నాలుగేళ్ల వయస్సు వచ్చాక 2020లో దూరమయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. 

పిల్లల మరణంతో కుంగిపోయిన మల్లికార్జున్‌ను చూసిన తోటి సహోద్యోగులు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ వేదనను మర్చిపోవడానికి అతడిలో అంతర్లీనంగా దాగి ఉన్న గాయకుడిని తట్టి లేపారు. గతాన్ని మర్చిపోవడానికి పాటలు పాడడం ప్రారంభించాడు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా ఫ్లేస్టోర్‌ నుంచి స్టార్‌ మేకర్‌ యాప్‌లో పాటలు పాడి అప్‌లోడ్‌ చేశారు. శ్రోతల నుంచి స్పందన రావడంతో డ్యూయెట్‌ పాటలను మేల్‌వర్షన్‌లో పాడి అప్‌లోడ్‌  చేయడం ప్రారంభించారు. నచ్చిన ఫిమేల్‌ సింగర్‌ అతడి గొంతుతో జత కలపడం, నచ్చిన ఫిమేల్‌ వాయిస్‌కు మెయిల్‌ వర్షన్‌లో  మల్లికార్జున్‌ శృతి కలిపి డ్యూయెట్‌ పాటలు పాడటం మొదలు పెట్టారు. అలా ఏకంగా 3,387 పాటలు పాడి ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు.

చిన్నప్పటినుంచే పాటలపై ఆసక్తి
కరీంనగర్‌కు చెందిన చెరుకు మల్లికార్జున్‌ 1996లో పోలీసు శాఖలో ఆర్ముడ్‌ రిజర్వుడ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేశారు. అంతకుముందు 1994–95లో మెడికల్‌ రిప్రజెంటిటివ్‌గా పని చేశారు. 1995లో శ్యామలతో వివాహం జరిగింది. మల్లికార్జున్‌ 2009లో ఇన్‌స్పెక్టర్‌గా, 2019లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఏడాదిన్నర కాలంగా బెల్లంపల్లి ఆర్ముడ్‌ రిజర్వుడు ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి ఉండగా చదువుకునే రోజుల్లో కళాశాలలో, పోలీసు కార్యక్రమాల్లో పాటలు పాడేవారు. (క్లిక్ చేయండి: అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు)


బాలు గాత్రం అంటే ఎంతో ఇష్టం 

పిల్లల జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రస్తుతం స్టార్‌ మేకర్‌ వేదిగా పాటలు పాడుతున్నాను. పిల్లల కోసం నేర్చుకున్న పాటలు ఆ ఇద్దరు మానుండి వెళ్లిపోయాక మర్చిపోవడానికి మళ్లీ పాడడాన్ని ఎంచుకున్నాను. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అంటే ఎంతో ఇష్టం. తుది ఊపిరి ఆగిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాను. 
– మల్లికార్జున్, సీఆర్‌ ఏసీపీ, బెల్లంపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement