ఒక రోజు సర్వే నిర్వహించడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విమర్శించారు.
తాండూర్ : ఒక రోజు సర్వే నిర్వహించడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విమర్శించారు. ఈ సర్వే వల్ల నిర్దిష్టమైన ప్రణాళిక తయారు కాబోదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మాదారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ప్రకటించకుండా హామీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని అన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మి రుణ మాఫీలు చేస్తే పేదలకు భూమి ఎలా పంచుతారని అన్నారు. అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర సాగుతోందని, అటవీ హక్కుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు.
బహిరంగ సభకు భారీగా తరలిరండి
ఈ నెల 11న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే చండ్ర రాజేశ్వర్‌రావు శతజయంతి బహిరంగ సభకు ప్రజలు పెద్దయెత్తున తరలి రావాలని గుండా మల్లేశ్ కోరారు. పది వేల మంది జన సేవాదళ్ కార్యకర్తలతో కవాతు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కళవేణి శంకర్, మండల కార్యదర్శి మామిడాల రాజేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పులుగం వెంకటేశ్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి తదితరులు పాల్గొన్నారు.