జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సరఫరా నిలిచింది. కోడిగుడ్ల కోసం చిన్నారులు, బాలింతలు, కిశోర బాలికలు నెల రోజులు ఎదురుచూస్తున్నారు.
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సరఫరా నిలిచింది. కోడిగుడ్ల కోసం చిన్నారులు, బాలింతలు, కిశోర బాలికలు నెల రోజులు ఎదురుచూస్తున్నారు. కోడిగుడ్లు పంపిణీ చేసే గుత్తేదార్లు పెరిగిన ధరలకు అనుగుణంగా ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెంచాలని సరఫరా నిలిపివేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్లు ప్రతి నెలా మొదటి, మూడో వారంలో రెండు దఫాలుగా ప్రత్యేక వాహనాల్లో కోడిగుడ్లు చేరవేస్తారు. ఆ తర్వాత అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు గుడ్లను అందజేస్తారు. కానీ ప్రస్తుతం గుడ్ల పంపిణీ జిల్లాలోని కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో అరకొరగా పంపిణీ చేస్తుండగా, మెజార్టీ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో కోడిగుడ్ల పంపిణీ జరగడం లేదు. నవంబర్‌లో అరకొరగా గుడ్లు పంపిణీ చేయగా, డిసెంబర్‌లో గుడ్లు అసలు రాలేదు.
పెరిగిన కోడిగుడ్డు ధర
అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లను కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేస్తారు. సదరు ఏజెన్సీ నిర్వాహకులు హోల్‌సేల్‌గా గుడ్లను పక్షం రోజులకోసారి అంగన్‌వాడీ కేంద్రాలకు అందిస్తారు. గుడ్లను పంపిణీ చేయడానికి రూ.3.40 పైసలకు గుత్తేదార్లు టెండర్‌ను దక్కించుకున్నా రు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.4.50 పైసలకు అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.5కు ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. ఆ రకంగా పెరిగిన గుడ్డు ధరను చూసి గుత్తేదార్లు ఒక్కసారిగా గుడ్లు తేలేసి చేతులెత్తేశారు.
టెండర్ ముగిసి నెలలు గడుస్తున్నా..
కోడిగుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్ల టెండర్ గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. ఏప్రిల్ నుంచి సదరు కాంట్రాక్టర్లతోనే గుడ్లను సరఫరా చేయిస్తున్నారు. కొత్త టెండర్‌ను పిలవకపోవడంతో పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల వల్ల రేటు గిట్టుబాటు కావడం లేదనే ఉద్దేశంతో కొన్ని నెలల నుంచి కాంట్రాక్టర్లు గుడ్ల సరఫరాకు వెనుకాడుతున్నారు. ఒక్కో గుడ్డు ట్రాన్స్‌పోర్టుకు రూ.70 పైసలు పెంచాలని జిల్లా ప్రాజెక్టు అధికారికి వినతిపత్రాలు అందజేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో సమస్య మొదటికొచ్చింది. నష్టాలతో గుడ్లను పంపిణీ చేయలేమని కాంట్రాక్టర్లు తేల్చిచెప్పడంతో ఈ నెలలో గుడ్ల పంపిణీ ఆగింది. కాంట్రాక్టర్లు కోరినట్లు ట్రాన్స్‌పోర్టు చార్జీ పెంచడమో లేదా కొత్తగా టెండర్‌ను ఆహ్వానించడమో చేస్తే కాని అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు ఇప్పట్లో సరఫరా అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
అధికారులు స్పందించాలి..
అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లను పంపిణీ చేసేందుకు మహిళా, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు స్పందించాలి. బలవర్తకమైన గు డ్డును అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించకపోయినట్లయితే చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికల్లో రక్తహీనత, ఇత ర శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడ్ల పంపిణీ కోసం తక్షణ అవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.
కమిషనర్‌కు పంపించాం..
- మీరా బెనర్జీ, ఐసీడీఎస్ పీడీ, ఆదిలాబాద్
కాంట్రాక్టర్లు కోరినట్టుగా గుడ్డుకొక్కంటికి రూ.70 పైసలు ట్రాన్స్‌పోర్టు చార్జీ పెంచాలని కోరుతూ మహిళా, శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌కు నివేదికను పంపించాం. జేసీ లేకపోవడంతో కొత్తగా టెండర్ పిలిచే అవకాశాలు లేవు. కొత్త జేసీ వస్తేగాని ఆ సమస్య పరిష్కరమయ్యేటట్లు కనిపించడం లేదు. అయినప్పటికిని కొన్ని ఐసీడీఎస్ కేంద్రాల పరిధిలో గుడ్ల పంపిణీ జరుగుతోంది. పూర్తిగా ఎక్కడ గుడ్ల పంపిణీ నిలిచిపోలేదు.